Friday, April 24, 2020

బాదుషాలు

బాదుషాలు.
ఆలూరుకృష్ణప్రసాదు .

మేమెప్పుడూ బాదుషాలు  ఇంటి వద్ద ప్రయత్నించలేదు.

ఈ రోజు  కొద్ది  మైదా పిండితో  ప్రయత్నించాము. రుచి  బాగానే  కుదిరింది.

తయారీ  విధానము .

ఒక  పావు కిలో మైదా పిండిలో ఒక కప్పు పెరుగును , పావు కప్పు డాల్డాను లేదా  నెయ్యిని మరియు చిటికెడు  సోడా ఉప్పును  వేసి పూరీ పిండిలా కలుపు కోవాలి.

పైన తడి గుడ్డ కప్పి  ఒక గంట సేపు పిండిని  కదపకుండా  ఉంచుకోవాలి.

ఒక గంట తర్వాత  పిండిని బాగా  మెదాయించు కోవాలి,

తర్వాత  గుండ్రంగా  బిళ్ళలు  మాదిరిగా  చేసుకోవాలి.

ఒక గిన్నెలో పావు కిలో పంచదార లో  పంచదార మునిగే  వరకు  నీరు పోసుకుని స్టౌ మీద పెట్టుకుని  తీగ పాకం పట్టుకోవాలి.

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టుకుని  పావు కిలో  రిఫైండ్  ఆయిల్  పోసుకుని  ఆయిల్  బాగా  కాగగానే  బాదుషా బిళ్ళలు ఆయిల్ లో వేసుకుని సన్నని  సెగన  కాసిని కాసిని  బంగారు రంగులో  వేయించుకుని  సిద్ధంగా  ఉన్న పాకంలో వేసుకుని  అయిదు నిముషాలు  ఉంచుకుని అవి తీసుకుని , మిగిలినవి వేసుకుంటూ  ఉండాలి.

అంతే  ఎంతో రుచిగా  ఉండే  బాదుషాలు అల్పాహారానికి  సిద్ధం.

గోధుమ పిండితో తీపి కాజాలు

గోధుమ పిండితో తీపి కాజాలు.
ఆలూరి కృష్ణప్రసాదు


గోధుమ పిండి  -  పావు కిలో.
పంచదార  - 150 గ్రాములు.
నెయ్యి  -  మూడు  స్పూన్లు 
యాలకుల పొడి - అర స్పూను.
సోడా ఉప్పు  - చిటికెడు .
నూనె  -  పావు కిలో 

తయారీ విధానము .

ముందుగా  ఒక పావు కిలో  గోధుమ  పిండిలో , చిటికెడు  సోడా  ఉప్పు , మూడు స్పూన్లు  నెయ్యి  వేసుకుని తగినన్ని  నీళ్ళు పోసుకుని  చపాతీల పిండిలా కలుపుకోవాలి.

మూత పెట్టి  ఒక  గంట సేపు  పిండిని  నాన నివ్వాలి.

ఒక గంట అవ్వగానే   పిండిని బాగా  మెదాయించి  నిమ్మకాయంత  ఉండలుగా చేసుకోవాలి.

తర్వాత  చపాతీల పీట పై  అప్పడాల కర్రతో  గుండ్రంగా పల్చగా  వత్తుకుని చాకుతో  Cross గా  Daimond Shape లో  Cut చేసుకోవాలి.

ఈ విధముగా  అన్ని కాజాలు ఒకేసారి  చేసుకోవాలి.

ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టుకుని మొత్తము పంచదార పోసుకుని అందులో  ఒక అరగ్లాసు నీళ్ళు పోసుకోవాలి. తీగ పాకం వచ్చేదాకా ఉంచుకొని  అందులో యాలకుల పొడి  వేసుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  పోసుకుని నూనె పొగలు,,వచ్చే వరకు  నూనెను  బాగా కాగ నివ్వాలి.

అందులో  సిద్ధంగా  ఉంచుకున్న  కాజాలను  వేసుకుని రెండు  మూడు విడతలుగా  వేసుకుని ఎరుపు రంగు వచ్చేవరకు  వేగ నివ్వాలి.

వేగుతున్న కాజాలు పాకం లో వేసి ఒక ఏడెనిమిది  నిముషాలు  ఉంచి పాకము పట్టిన కాజాలు  వేరే  పళ్ళెము లోకి తీసుకోవాలి .

ఇలా అన్ని  కాజాలు  వేసుకుని తీసుకోవాలి.

అంతే . మధ్యాహ్నము  అల్పాహారానికి  గోదుమ  పిండి  తీపి కాజాలు  సర్వింగ్  కు సిద్ధం.

ఇదే  పద్ధతిలో  మైదా పిండితో  కూడా  చేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

వెరైటీ కారప్పొడి



దోశెలలోకి  మరియు ఇడ్లీల లోకి  మరో  వెరైటీ  కారప్పొడి .
ఆలూరుకృష్ణప్రసాదు .


కావలసినవి.

ఎండుమిరపకాయలు  - 20
పచ్చిశనగపప్పు  - 100 గ్రాములు.
చాయమినపప్పు -  50 గ్రాములు.
కరివేపాకు -  ఒక కప్పున్నర.
నూనె  -  నాలుగు స్పూన్లు 
ఇంగువ - పావు స్పూను 
ఉప్పు  -  తగినంత .

తయారీ  విధానము.

 స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  వేయకుండా  ముందుగా  పచ్చిశనగపప్పు ఎర్రగా  కమ్మని వాసన వచ్చే వరకు వేయించు కోవాలి. వేగిన పచ్చిశనగపప్పు  వేరే ప్లేటులోకి  తీసుకోవాలి .

తర్వాత  చాయమినపప్పు  కూడా  బాండిలో  నూనె వేయకుండా  కమ్మగా  వేగిన  వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి. తర్వాత  వేగిన చాయమినపప్పు  విడిగా  మరో ప్లేటులోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద తిరిగి  బాండీ పెట్టి  మొత్తము  నాలుగు  స్పూన్లు  నూనెను వేసుకుని  నూనె బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , కరివేపాకు  మరియు ఇంగువను  వేసి  మిరపకాయలు  మరియు కరివేపాకు  వేగే  వరకు  వేయించుకోవాలి.

ఇవ్వన్నీ  చల్లారిన తర్వాత  ముందుగా  మిక్సీ లో వేయించిన ఎండుమిరపకాయలు , కరివేపాకు ,  ఇంగువ  మిశ్రమము  మరియు  తగినంత  ఉప్పును వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  అందులోనే  నూనె వేయకుండా  వేయించిన  పచ్చిశనగపప్పు  మరియు చాయమినపప్పు  కూడా వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా  కొంచెం  పప్పులు నోటికి  తగిలే విధముగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  ఈ మిశ్రమమును  ఒక పళ్ళెంలో  వేసుకుని చేతితో  బాగా  కలుపుకుని   ఒక సీసాలోకి  తీసుకోవాలి .

అంతే  ఇడ్లీ , దోశెలు , గారెలు  మరియు చపాతీల లోకి  కారప్పొడి  సర్వింగ్  కు సిద్ధం.

ఇదే విధముగా  పొడి కొట్టుకుని  వంకాయ మరియు  దొండకాయ వంటి  కాయల పళంగా  చేసుకునే కూరలలో పెట్టుకోవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

చింత చిగురు పొడి

చింత చిగురు పొడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి.

చింత  చిగురు  -  150 గ్రాములు.

ఎండుమిరపకాయలు  - 12

చాయమినపప్పు  -  రెండు  స్పూన్లు .

ధనియాలు  -  ఆరు స్పూన్లు .

జీలకర్ర  -  అర స్పూను

వెల్లుల్లి  - 20  రెబ్బలు.

(  వెల్లుల్లి  ఇష్టపడని  వారు వెల్లుల్లి  బదులుగా  మరో స్పూను జీలకర్ర  వేసుకుని పొడి  కొట్టు కొన వచ్చును. ) 

ఉప్పు  -  తగినంత .

నూనె  -  ఐదు  స్పూన్లు .

తయారీ విధానము .

ముందుగా  చింత చిగురు పుల్లలు లేకుండా శుభ్రం చేసుకోవాలి.

చింత చిగురు ఒకసారి కడిగి తడి లేకుండా  ఒక గంట సేపు నీడన  ఆర బెట్టు కోవాలి.

వెల్లుల్లి  పై పొట్టు తీయకుండా  ఒలిచి  ఉంచుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా కాగగానే  చింత చిగురు నూనెలో వేసుకుని  ఆకును బాగా  తడి లేకుండా మగ్గ నివ్వాలి.

ఆకు మగ్గగానే  విడిగా  వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి .

తర్వాత  తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టుకుని  మిగిలిన  మూడు స్పూన్లు నూనెను వేసుకుని నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు మరియు జీలకర్రను  వేసుకుని పోపు కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే  మిక్సీ లో ముందుగా   ఎండుమిరపకాయలు  మరియు ఉప్పును వేసుకుని మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  మిగిలిన పోపును మరియు చింత చిగురును  వేసుకుని  మిక్సీ   వేసుకోవాలి.

చివరగా  వెల్లుల్లి  పాయలు కూడా వేసుకుని  ఒకసారి మిక్సీ  వేసుకుని , ఒక పళ్ళెములో పోసుకుని  చేతితో  బాగా కలుపుకుని ఒక సీసా లోకి  తీసుకోవాలి .

చింతచిగురులో స్వతహాగా పులుపు ఉంటుంది  కనుక ఈ పొడిలో విడిగా  చింతపండు  వేయనవసరం లేదు.

ఈ పొడి పది రోజులు నిల్వ  ఉంటుంది .

వేడి వేడి అన్నంలో నెయ్యి  వేసుకుని ఈ చింత చిగురు పొడిని వేసుకుని తింటే చాలా రుచిగా  ఉంటుంది . ఆరోగ్యానికి  చాలా మంచిది. నోరు అరుచిగా ఉన్నా తొలగి పోతుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో  తయారు చేయు సమయమున  తీసినది.

Sunday, April 19, 2020

కందిపప్పు కొబ్బరిముక్కల పచ్చడి .

కందిపప్పు కొబ్బరిముక్కల  పచ్చడి .
ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి .

కందిపప్పు  --  ఒక కప్పు
పచ్చికొబ్బరి  ముక్కలు --  ఒక కప్పు.
ఎండుమిరపకాయలు  --  పది 
జీలకర్ర  --  స్పూను 
చింతపండు  --  చిన్న ఉసిరి కాయంత.
ఉప్పు  --  తగినంత 
ఇంగువ -- కొద్దిగా 

పోపునకు .

ఎండుమిర్చి  --  మూడు.  చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి 
చాయమినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు 

తయారీ విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోండి. 

తర్వాత  అందులోనే  చిన్న ముక్కలుగా  తరిగిన  కొబ్బరి ముక్కలు  వేసి  పచ్చి వాసన పోయేవరకు  ఉంచి  దింపి  వేరేగా  పళ్ళెంలో  తీసుకోండి .

పోపు  చల్లారగానే   ముందుగా  మిక్సీ లో వేయించిన  ఎండుమిరపకాయలు , వేయించిన  కందిపప్పు  , తడిపిన చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

తర్వాత  వేగిన  కొబ్బరి  ముక్కలు కూడా వేసి ,  కొద్దిగా  నీళ్ళు పోసుకుని   మెత్తగా  మిక్సీ  వేసుకోండి .

తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోండి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోండి .

అంతే   ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు  కొబ్బరి ముక్కల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

నిమ్మకాయ ఊరగాయ

నిమ్మకాయ  ఊరగాయ.
ఆలూరుకృష్ణప్రసాదు .
కావలసినవి.

గుండ్రని పసుపు పచ్చని ,  పై తొక్క పలుచగా ఉన్న నిమ్మకాయలు -     20

పసుపు  -  స్పూనున్నర 

మెత్తని ఉప్పు  -   షుమారుగా  150 గ్రాములు.

కారం   -  షుమారుగా  125  గ్రాములు.

మెంతి పిండి  - రెండున్నర  స్పూన్లు .

(  30  గ్రాముల మెంతులను  బాండీలో నూనె  వేయకుండా  బాగా  వేయించి  చల్లారిన తర్వాత  మిక్సీ లో  మెత్తని  పొడిగా  వేసుకుని  ఒక సీసాలో  వేసుకోవాలి. ) ఈ పొడి  మరో రెండు మూడుసార్లకు  వస్తుంది.

తయారీ విధానము.

ముందుగా  నిమ్మ కాయలు  తడి గుడ్డతో  శుభ్రంగా  తుడుచుకుని ఓ పది నిముషాలు  నీడన  ఆర  నివ్వాలి.

అందులో  15  నిమ్మ కాయలు ముక్కలుగా తరుగు కోవాలి.

ఒక అయిదు  నిమ్మ కాయలు  రసం ఒక  గిన్నెలో  వేరుగా తీసుకోవాలి .

ఒక  బేసిన్ లో తరిగిన  నిమ్మకాయ ముక్కలు మరియు  విడిగా గిన్నెలోకి తీసిన నిమ్మరసం ముక్కలలో పోసుకోవాలి.

అందులో  పసుపు  మరియు  మొత్తము  ఉప్పును వేసుకుని  చేతితో  బాగా కలుపు కోవాలి.

దీనిని  ఒక జాడిలోకి  తీసుకోవాలి . మూడు రోజులు  కదపకుండా  ఉంచాలి.

నాలుగవ రోజు ఉదయం  ఒకసారి జాడీ లోని  ముక్కలను చేతితో బాగా కలుపుకుని ,  ఒక్కొక్క  ముక్కలోని రసము జాడిలోనే  చేతితో  పిండు కోవాలి.

ఆ విధముగా  పిండిన  ముక్కల లోని గింజలను  మరియు  జాడీ లోని  రసము లోని గింజలను  పూర్తిగా చేతితో తీసి వేసుకుని గింజలను  పడెయ్యాలి.

రసము పిండిన  ముక్కలను  ఒక పళ్ళెము  లో వేసుకుని  ఎర్రని  ఎండలో  రెండు రోజులు  ఎండబెట్టుకోవాలి. రసమును  ఎండ బెట్టవలసిన అవసరము లేదు.

ఆ విధముగా  ముక్కలను ఎండబెట్టడం వలన  ముక్కల పై తొక్క లోని  చేదు పోతుంది .

రెండు రోజులు  ముక్కలు  ఎండిన తర్వాత  ఒక బెసిన్ లో జాడీ లోని రసము  మొత్తమును  పోసుకోవాలి.

ఆ తర్వాత ఎండబెట్టిన  ముక్కలను  కూడా  రసములో  పోయాలి.

ఇప్పుడు  రెండు  పద్ధతులలో  ఈ నిమ్మకాయ ఊరగాయ వాడుకొనవచ్చును .

మొదటి  పద్ధతి.

 మొత్తము పచ్చడిలో   కారము మరియు  రెండున్నర  స్పూన్లు  మెంతి పిండి  వేసుకుని  చేతితో  బాగా  కలుపుకోవాలి.

ఆ తర్వాత  మొత్తము  పచ్చడిని  ఒక జాడీ లోకి  తీసుకోవాలి .

కావలసినప్పుడు  ఒక  ముప్పావు కప్పు  పచ్చడి తీసుకుని   అందులో  పోపు పెట్టుకుని వాడుకొనవచ్చును .

పోపు  వేయు  విధానము .

స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  నాలుగు  ఎండుమిరపకాయలు , పావు స్పూన్లులో  సగం మెంతులు , అర స్పూను ఆవాలు మరియు  కొద్దిగా  ఇంగువ వేసుకుని  వాడుకొనవచ్చును .

రెండవ పద్ధతి.

అసలు  కారము  మెంతి పిండి  కలపకుండా  ఎండిన ముక్కలు  రసము  కలిపిన  తర్వాత  జాడీ లోకి  తీసుకోవాలి.

కావలసినప్పుడు  ఒక ముప్పావు  కప్పు  పచ్చడి  విడిగా  తీసుకుని  అందులో  రెండు  స్పూన్లు  కారము మరియు అర స్పూను  మెంతి పిండిని  వేసుకుని  స్పూనుతో బాగా కలుపుకోవాలి.

ఇందులో  పోపు  మొదట  చెప్పిన  పద్ధతిలో  ప్రకారము  వేసుకొనవచ్చును .

ఈ నిమ్మకాయ  ఊరగాయ  వేడి వేడి అన్నంలో నెయ్యి  వేసుకుని కలుపుకుని తింటే చాలా రుచిగా  ఉంటుంది.

వేడి వేడి  అన్నంలో నెయ్యి వేసుకుని  ముద్ద పప్పు కలుపుకుని  ఈ నిమ్మకాయ ఊరగాయ నంచుకుని  తింటే  కూడా  చాలా రుచిగా  ఉంటుంది.

అంతే. ఇడ్లీలు , దోశెలు , గారెలు , చపాతీలు  మరియు భోజనము లోకి  ఎంతో రుచిగా ఉండే  నిమ్మకాయ ఊరగాయ  సర్వింగ్  కు సిద్ధం.

ఈ ఊరగాయ  ఖచ్చితంగా   నాలుగు నెలలు  తాజాగా   రుచిగా  ఉంటుంది .

నిమ్మకాయ ఊరగాయ  ముక్కలు  మరియు రసములో  కొంతమంది  పచ్చిమిర్చి  మరియు  అల్లం  ముక్కలు  వేసుకుంటారు.

కారం కలిపి పోపు  పెట్టిన తర్వాత  ఈ అల్లం  ముక్కలు  మరియు పచ్చిమిర్చి  పెరుగు అన్నంలో  నంచుకోవడానికి  చాలా రుచిగా ఉంటాయని అంటారు.

మీకు  ఇష్టమైన యెడల  ఆ విధముగా  వేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

క్యాప్సికమ్ ఉల్లి కారం కూర ( కాయల పళంగా )

క్యాప్సికమ్  ఉల్లి కారం కూర ( కాయల పళంగా )

ఆలూరుకృష్ణప్రసాదు .


క్యాప్సికమ్  ఉల్లికారం కూర . ( కాయల పళంగా కూర )

కావలసిన  పదార్థములు.

క్యాప్సికమ్   ---  అర కిలో.

పచ్చి శనగపప్పు  --  25  గ్రాములు

చాయ  మినపప్పు  -  20  గ్రాములు .

ఆవాలు  --   పావు స్పూను .

ఎండు మిరపకాయలు  --  10

ఉల్లిపాయలు  -  మూడు.

ఉప్పు  ---  తగినంత 

నూనె  --   100  గ్రాములు .

తయారు  చేయు విధానము .

ఉల్లిపాయలు  పొట్టు తీసి ముక్కలుగా తరుగు కోవాలి.

క్యాప్సికమ్  నాలుగు పక్షాలుగా చేస్తే  కారం కాయనుండి విడిపోయి నూనెలో పడి మాడిపోతుందేమోనని  మేము క్యాప్సికమ్ పై తొడిమ తీసేసి చిన్న రంధ్రం చేసాము.

మీరు మీ వీలుని బట్టి  మాలా చేసిన సరే  లేదా కాయను నాలుగు  పక్షాలుగా చేసినా సరే.

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసి నూనె బాగాకాగగానే ముందుగా  ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , ఆవాలు  వేసి పోపు  కమ్మని  వాసన  వచ్చేదాకా  వేయించు కోవాలి.

ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ  ముక్కలను వేసి  ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి .

పోపు  చల్లారిన  తర్వాత  మిక్సీలో  ఈ  పోపు  మొత్తము మరియు తగినంత  ఉప్పును  వేసి మరీ మెత్తగా  కాకుండా  అంటే  కొంచెము  పప్పులు  పంటికి  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

దీనినే  ఉల్లి కారం అని అంటారు.

ముందుగా   సిద్ధం  చేసుకున్న ఈ ఉల్లికారం  కాయల్లో పై రంధ్రము నుండి కూరు కోవాలి .

చివరలో కూర   దించబోయే  ఐదు నిముషాలు  ముందు కూర  పైన వేసుకోవడానికి  కాస్త  ఉల్లికారం  విడిగా  తీసుకుని ఉంచుకోవాలి .

మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  అంతా పోసి  నూనె  బాగా  కాగాక  ఉల్లి కారం కూరిన   క్యాప్సికమ్ కాయలను  వేసి  మీడియం  సెగన  కాయలు  మగ్గి  కారం  వేగే  దాకా  మధ్య మధ్యలో  అట్లకాడతో  తిరగవేస్తూ
కలుపుతూ  ఉండాలి .

దింప  బోయే   అయిదు  నిముషాల ముందు  మిగిలిన ఉల్లికారం కూడా  వేసి  కూర బాగా కమ్మని వాసన వచ్చి వేగాక   దించుకుని , వేరే  డిష్ లోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ ఘమ లాడే క్యాప్సికమ్ ఉల్లి కారంకాయల పళంగా కూర  సర్వింగ్  కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.

Thursday, April 16, 2020

బెల్లం‌ ఆవకాయ

ఆంధ్రా స్పెషల్ - బెల్లం  ఆవకాయ.

ఆలూరుకృష్ణప్రసాదు

 శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్టణం , తూర్పు గోదావరి మరియు  పశ్చిమ  గోదావరి జిల్లాల వారు  ఈ బెల్లం ఆవకాయ ఏడాది నిల్వ ఊరగాయను ఎక్కువ మంది  పెట్టుకుంటారు.

మిగిలిన ఆంధ్ర ప్రాంతం వారు చాలా తక్కువగా  పెట్టుకుంటారు.

మేము  ఆవకాయ , మాగాయలతో పాటుగా  ఈ బెల్లం  ఆవకాయను ప్రతి సంవత్సరం  తప్పనిసరిగా  పెట్టుకుంటాం.

నా ఊహ తెలిసినప్పటి నుండి  అంటే  షుమారు 60 సంవత్సరాల  పై నుండీ  మా ఇంట్లో  తప్పనిసరిగా  బెల్లం  ఆవకాయను ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము.
ఈ బెల్లం  ఆవకాయ నిక్షేపంగా  ఏడాదిన్నర కూడా నిల్వ ఉంటుంది.

అందుకు ప్రధాన కారణం  మూడు రోజులు ఈ బెల్లం  ఆవకాయను ఎర్రటి  ఎండలో పెడతాము . అందువలన  ఈ బెల్లం ఆవకాయ పాడవదు.

చాలామంది  పై తెలిపిన ప్రాంతాల వారు కాకుండా  ఇతర ప్రాంతాల వారు , దాని రుచి తెలియని వారు " ఆవకాయ లో బెల్లం  ఏమిటి ? " అని మొహం చిట్లిస్తారు. అలా అనే వారు ఈ ఆవకాయ రుచి చూడని వారు మాత్రమే అని  నా అభిప్రాయం.

మేం గుంటూరు జిల్లా లో ఉన్నా ,   మేం తప్పనిసరిగా  ప్రతి సంవత్సరం  పెట్టుకుంటాం కనుక  , మా అన్నదమ్ముల స్నేహితులు , మా ఇరుగు పొరుగు  చుట్టు ప్రక్కల వారు  అందరికీ  మా వల్ల ఈ బెల్లం ఆవకాయ  అలవాటు  చేసాము. వారందరికీ  ఎంతో నచ్చింది.

ప్రతి ఏడు మా అమ్మని ప్రత్యేకంగా  అడిగి  కనీసం ఒక చిన్న హార్లిక్స్  సీసాడు  బెల్లం ఆవకాయ పట్టుకు వెడతారు.

ప్రస్తుతం  మేము తెనాలి లో ఉంటున్నాం కనుక మేము బెల్లం  ఆవకాయ పెట్టుకుంటాం అని తెలిసిన మా స్నేహితులందరూ ప్రత్యేకంగా  అడిగి  మరీ  ఒక చిన్న హార్లిక్స్ సీసాడు బెల్లం  ఆవకాయ పట్టుకుని వెడతారు. తిన్నారా ఎలా ఉంది ? అని అడిగితే " మేము ఇద్దరం  తింటే అయిపోతుంది కదండీ. బెంగుళూరులో ఉంటున్న మా అబ్బాయికి  మీ బెల్లం  ఆవకాయ చాలా ఇష్టం. అందువల్ల వాడికి  పంపాము " అని అంటారు.

ఇదంతా నేను ఎందుకు  చెబుతున్నానంటే  తినని వాళ్ళకు , తినడానికి  ఇష్ట పడని వాళ్ళకే ఈ బెల్లం ఆవకాయ నచ్చదు. ఒకసారి తిని దాని రుచి తెలుసుకున్న వాళ్ళు ఏ ప్రాంతం వారయినా  తినకుండా  ఉండలేరు.

మా చిన్నతనంలో  మా అమ్మ  రెండు పెద్ద జాడీల నిండా అంటే షుమారు ఓ 50 మామిడి కాయలతో ఈ బెల్లం ఆవకాయ పెట్టేది. అమ్మది  భారీ చెయ్యి. పెట్టిన నాలుగో రోజు నుండి  మూడు రోజులు మేడ మీద ఎండలో  పెట్టేది.

మా స్నేహితులు , మా అన్నదమ్ముల స్నేహితులు  మాతో ఆడుకోవడాని కనే మిషతో  మా ఇంటికి  వచ్చి మేడ మీద జాడీ లో  ఎండ బెట్టిన బెల్లం  ఆవకాయ ముక్కలను చేతితో తీసుకుని  ' హాంఫట్ హాంఫట్ ' అంటూ తినేసేవారు. మా అమ్మకు  తర్వాత తెలిసి  ' ఏ చేతులతో పడితే ఆ చేతులతో  ఆవకాయలు ముట్టుకోకూడదు. ఏడాది పచ్చళ్ళు పాడవుతాయి ' అని కోప్పడేదనుకోండి. ఇవి మా గుంటూరు జిల్లాలో మాఅందరికీ మా స్నేహితులతో  ఈ బెల్లం ఆవకాయ మధుర జ్ఞాపకములు.

ఇక  అసలు విషయానికి  వద్దాము.

బెల్లం ఆవకాయ.
************

మేము మరియు లోగడ మా అమ్మమ్మ మరియు  కాకినాడ  లో ఉన్న మా బంధువులు  అందరూ ఈ బెల్లం  ఆవకాయ పెట్టుకోవడానికి  కలెక్టరు మామిడి / చిత్తూరు మామిడి / తోతాపురి (  ఈ మూడు పేర్లు  ఒకటే కాయ )  కాయనే  వాడతారు. ప్రధాన కారణం  ఈ బెల్లం  ఆవకాయ పెట్టుకోవడానికి  ఈ కాయ బాగుంటుందనే వారు.

ఈ చిత్తూరు మామిడి కాయ లేత కాయ కాకుండా  బాగా తయారయ్యి లోపల టెంక మరియు పీచు ఉన్న కాయలనే ఎంచుకునే వారు. కాయ అసలు పండకుండా బాగా గట్టిగా ఉండాలి.

అలాగే  బెల్లం  ఆవకాయలో వాడే బెల్లం  కూడా  మామూలుగా  మనం ఇళ్ళల్లో  వాడే బెల్లం  కాకుండా , మేము కాకినాడ  ప్రాంతం వారమే కాబట్టి  షుమారు నెలరోజుల ముందే అంటే  కాయ రాకముందే ప్రత్యేకంగా  ' బూరుగు పల్లి '  బెల్లం  ఒక మూడు కిలోలు  తెప్పించుకునే వారము . కాకినాడ పెద్ద మార్కెట్ దగ్గర  కల  పచారీ  షాపులలో  బెల్లం ఆవకాయకు  బూరుగు పల్లి బెల్లం  కావాలని  అడిగితే  ఇచ్చే వారు.

ఇప్పుడు  తెనాలిలో ఉన్నా  ప్రతి సంవత్సరం  బెల్లం  ఆవకాయ కోసం కాకినాడ  నుంచి  బంధువుల ద్వారా బూరుగపల్లి బెల్లం తెప్పించుకుంటాము.

కావలసినవి.

చిత్తూరు  మామిడి  కాయలు  -  10  కాయలు.
( షుమారుగా  రెండున్నర  కిలోల ముక్కలు వస్తాయి . )

బూరుగు పల్లి  బెల్లం  లేదా  దొరకనిచో మామూలు బెల్లం  --  ఒక  కిలో లేదా కిలోం పావు  బెల్లం తీసుకుని  రోటిలో దంపుకుని ఒక కిలో బెల్లం పొడి వచ్చే విధముగా  సిద్ధం చేసుకోవాలి.

కారము , ఉప్పు , ఆవపిండి - మూడు కలిపి   --  ఒక కిలో.

ఇందులో  -

కారము  -  400 గ్రాములు.
ఆవపిండి - 350 గ్రాములు.
మెత్తని ఉప్పు - 250 గ్రాములు.
( అయోడైజ్డ్  కానిది . )

ఈ మూడు పైన తెలిపిన పాళ్ళలో తీసుకుని  ఒక బేసిన్  లో వేసుకుని  చేతితో  బాగా కలుపుకొని  విడిగా  ఒక  జాడీలో కాని జార్ లో కాని పోసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి.

పసుపు  -  స్పూనున్నర .

మెంతులు  -  స్పూనున్నర .

చింతపండు  -  నిమ్మకాయంత  తీసుకుని శుభ్రం  చేసుకుని , గింజలను  తీసి వేసి విడదీసుకుని  రోటిలో  తొక్కి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి.

బెల్లం  ఆవకాయ సిద్ధ మయ్యాక   --

పోపునకు  --

సామర్లకోట  A . S . Brand నువ్వు పప్పు నూనె  -  పావు కిలో.

ఎండుమిరపకాయలు  - 12

వెల్లుల్లి  పాయలు  -  150 గ్రాములు.

వెల్లుల్లి పాయలు  విడదీసి  రెబ్బలు మీద పొట్టు అంతా  తీసుకుని   సిద్ధం చేసుకోవాలి. 

ఆవాలు  --  రెండు  స్పూన్లు .

తయారీ విధానము.

బాగా తయారయ్యి  టెంక  పట్టి  అసలు పండకుండా గట్టిగా  ఉన్న చిత్తూరు మామిడి  కాయలు  ఒక  పది కాయలు తీసుకోవాలి.

వాటిని ఒక  టబ్ లో నీటిలో వేసుకుని  ఒక  అరగంట సేపు నీటిలో నాన నివ్వాలి.

తర్వాత  ఒక్కొక్క  కాయను తీసుకుని  పొడిగా  గుడ్డతో కాయలను శుభ్రంగా తుడుచు కోవాలి. మరో అరగంట సేపు కాయలను  పొడిగా  ఆర నివ్వాలి.

తర్వాత  మామిడి  కాయల మీద ఉన్న చెక్కును పీలర్ తో కాని  లేదా కత్తి పీటతో కాని లేదా ఆల్ చిప్పతో కాని తీసుకోవాలి . మొత్తము  అన్ని కాయల మీద పై చెక్కును తీసుకోవాలి .

ముందు కాయను మధ్యలో సగానికి  తరుకుని  టెంకలోని పై పొట్టు తీసి వేయాలి. ఇలా అన్ని కాయలకు  తీసి వేయాలి.

తర్వాత  మామూలుగా  ఆవకాయ పెట్టడానికి  ముక్కలు ఏ విధముగా  తరుగుతామో  అదే విధముగా  ప్రతి ముక్క పైన టెంక వచ్చే విధముగా  ముక్కలను తరుగు కోవాలి.

ఇప్పుడు  ఒక పెద్ద బేసిన్ తీసుకుని  తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  మామిడి  కాయ ముక్కలను  బేసిన్ లో వేసుకోవాలి.

అందులో స్పూనున్నర  పసుపు వేసుకుని ముక్కలకు పట్టే  విధముగా  బాగా కలుపు కోవాలి.

కారం , ఆవపిండి  మరియు  ఉప్పు  ఈ మూడు కలిపి  సిద్ధంగా  ఉంచుకున్న  కిలో గుండను  మరియు  స్పూనున్నర  మెంతులు  ముక్కలలో వేసుకుని గుండ ముక్కలకు పట్టే విధముగా  బాగా కలుపు కోవాలి.

ఇప్పుడు సిద్ధంగా  ఉంచుకున్న  ఒక  కిలో బెల్లం  పొడి  మరియు చిన్న చిన్న బిళ్ళలను చేసి సిద్ధంగా  ఉంచుకున్న  చింతపండును కూడా  అందులో వేసి చేతితో బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు  ఈ కలిపిన మిశ్రమము మరియు ముక్కలు  మొత్తము  ఒక  పెద్ద జాడీలో పెట్టుకుని  గట్టిగా  మూత పెట్టుకోవాలి.  ఒక ప్రక్కన కదపకుండా  పూర్తిగా  మూడు రోజులు  ఉంచాలి.

ఇలా  ఉంచడం బెల్లం  మరియు ముక్కలకు  ఆవకాయలో తడి బాగా  వస్తుంది.

పూర్తిగా  మూడు రోజులు  కదపకుండా  ఉన్న  పిదప  నాలుగవ  రోజు ఆవకాయను  చెక్క గరిటె తో బాగా కలుపు కోవాలి.

ఈ బెల్లం  ఆవకాయ  అంతా  ఒకటి లేదా రెండు  బేసిన్  లలో  పోసుకుని  ఉదయం  9 గంటల నుండి  సాయంత్రం  5  గంటల  వరకు  పూర్తిగా  మూడు రోజులు ఎర్రటి  ఎండలో  పెట్టాలి. ప్రతి రోజు ఎండలో నుండి తెచ్చాక చెక్క గరిటెతో ఆవకాయ  బాగా కలుపు తుండాలి.

ఇలా  పూర్తిగా  మూడు రోజులు  ఎండబెట్టినందువలన  పచ్చడి  లోని పాకం పూర్తిగా  గట్టి పడుతుంది. ఆవకాయ లోని  తడి అంతా  పోతుంది. ప్రతి ముక్కకు  తీపి  కారము మొత్తము  సమంగా పట్టుకుంటాయి.  పచ్చడి  పూర్తిగా  దగ్గర  పడుతుంది.

మీరు కొద్దిగా  ఆవకాయ పెట్టుకున్నా  లేదా  ఎండలు  విపరీతంగా  ఉన్నా  ఆవకాయ రెండు  రోజులు ఎండబెట్టితే  సరిపోతుంది .  అటువంటప్పుడు  మరీ ఎక్కువగా  ఎండితే  ఆవకాయ మరీ  ఎండి పోయి  పిడస కట్టినట్లుగా  అయి పోతుంది. మీరు మాత్రం ఈ విషయము  జాగ్రత్తగా   గమనించుకోవాలి.

పూర్తిగా  మూడు రోజులు  ఎండ బెట్టిన తర్వాత  ఆ రోజు  సాయంత్రం బెల్లం  ఆవకాయ లో  పోపు పెట్టుకోవాలి.

ఒక  వెల్లుల్లి  వేసి పోపు పెడితే  బెల్లం  ఆవకాయ ని అంటారని , వెల్లుల్లి తో పాటుగా  ఎండుమిరపకాయలు  , ఆవాలు మరియు కరివేపాకును  వేసి పోపు పెడితే  దప్పళపు ఆవకాయ  అంటారని  మా అమ్మమ్మ  వాళ్ళు చెప్పారు.

ఇక మూడవ రోజు  సాయంత్రం  ఎండలో నుండి  తెచ్చిన  బెల్లం  ఆవకాయలో  పోపు  పెట్టుకునే  విధానము.

స్టౌ  మీద  బాండి  పెట్టి  మొత్తము  పావు కిలో  పప్పు నూనెను  బాండీలో పోయాలి.

బాండిలో నూనె బాగా కాగగానే  తొడిమలు  తీసిన  ఎండుమిరపకాయలు , ఆవాలు  మరియు కరివేపాకును  వేసి పోపును వేగ నివ్వాలి.  అందులోనే  ఒలిచి  సిద్ధంగా  ఉంచుకున్న  వెల్లుల్లి పాయలు కూడా  వేసుకుని  వెల్లుల్లి  పాయలు  బంగారు రంగులో  వచ్చే వరకు  వేయించు కోవాలి.

ఈ వేగిన  పోపును  వేడిగానే  బెల్లం  ఆవకాయ లో  వేసుకుని  చెక్క గరిటెతో  బాగా కలుపు కోవాలి.

చల్లారగానే  తిరిగి  జాడీలోనికి  తీసుకుని  జాడి పైన  వాసిన కట్టుకుని  భద్రపరుచుకోవాలి.

కావలసినప్పుడు   చిన్న జాడీల లోకి తీసుకుని   వాడుకొనవచ్చును .

అంతే. ఇడ్లీల లోకి , దోశెల లోకి , గారెల లోకి , రోటీల లోకి , చపాతీల లోకి  మరియు  భోజనము  లోకి  అద్భుతమైన  రుచిగా  ఉండే  బెల్లం  ఆవకాయ  సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధించిన  రెసిపీ మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటోలు  తయారుచేయు  సమయమున తీసినది.
ఆలూరుకృష్ణప్రసాదు .
ముఖ్య గమనిక  --

మేము ఈ బెల్లం ఆవకాయకు  మామిడి కాయల  పై  చెక్కు తీస్తాము.
మీరు  కావాలిస్తే  పై చెక్కు తో ముక్కలు తరుగు కోవచ్చును.

మేము  చిత్తూరు  మామిడి కాయలతోనే  ఈ బెల్లం  ఆవకాయ పెడతాము.
మీరు  మామూలుగా  ఆవకాయ పెట్టే కాయలతో  కూడా  బెల్లం  ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  బూరుగు పల్లి  బెల్లమే  బెల్లపు  ఆవకాయ  తయారు చేయడానికి  వాడతాము.
మీరు మీకు మార్కెట్లో  దొరికే  ఏ రకమైన బెల్లంతో నైనా  బెల్లం ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  ఈ బెల్లం  ఆవకాయలో  వెల్లుల్లి  పాయలు  వేసుకుంటాము .
మీరు వెల్లుల్లి  వేయకుండా  బెల్లం  ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  ఈ బెల్లం  ఆవకాయలో  ఇంగువ  వేసుకోము.
మీరు కావాలనుకుంటే  ఇంగువ  వేసుకోవచ్చును.

బియ్యప్పిండి వడియాలు

బియ్యపు పిండితో వడియాలు.

ఆలూరుకృష్ణప్రసాదు .
బియ్యపు పిండితో వడియాలు.

ఏప్రిల్  మూడవ వారంలో ఉన్నాము. ఎండలు కూడా బాగా మండుతున్నాయి.

బియ్యపు పిండితో వడియాలు  పెట్టుకోవడానికి  ఇదే మంచి తరుణం.

 పరిస్థితులు  ఎలా ఉన్నా  ఈ సీజన్ లో వడియాలు , ఊరగాయలు
పెట్టుకోకపోతే ఏడాది అంతా  ఇవి లేక ఇబ్బంది పడాలి.

ఇక బియ్యపు పిండితో వడియాలు తయారీ విధానము  గురించి  తెలుసుకుందాం .

బియ్యపు  పిండితో వడియాలు.
******************

కావలసినవి.

రెండు గ్లాసుల బియ్యము రాత్రి నాన పోసుకుని ఉదయాన్నే కడిగి వడకట్టు కోవాలి.

బియ్యపు పిండి వడియాలు తయారీకి ఒక గ్లాసు కొలత పెట్టుకోండి.

ఉదయాన్నే  తడి  బియ్యము పిండి మెత్తగా మర పట్టించు కోండి.

బియ్యము తడపకుండా  పొడి  బియ్యము మర పట్టించి  పోయిన సంవత్సరం మా  శ్రీమతి  వడియాలు పెట్టింది.

ఎందుకో  సరిగ్గా  రాలేదు. వడియము  ఎండాక ముక్కలుగా  విరిగి పోయింది.

మా ఇంటి  ఎదురుగా  ఉన్నవారు వడియాలు , అప్పడాలు అవి పెడుతుంటారు. వారిని అడిగితే  తడి బియ్యపు పిండితో  పెడితే వడియాలు బాగా  వస్తాయని  వారే  చెప్పారు.

వారు చెప్పినట్లుగా  ఈ ఏడాది  తడి బియ్యము  మర పట్టించి  చేసింది.

వడియాలు అన్నీ  విరగకుండా  బాగా  వచ్చాయి.

తడి  బియ్యము  పిండి  పట్టించాక పిండి  జల్లెడతో  పిండి  జల్లించుకోండి. పిండి  ఎంత వచ్చిందీ  ఒక గ్లాసుతో కొలుచుకోండి.

గ్లాసుతో కొలుచుకోవడం ఎందుకంటే  ఒక  గ్లాసు  బియ్యపు పిండికి  ఆరుగ్లాసుల నీళ్ళు పడతాయి .

అందువలన  పిండి  గ్లాసుతో కొలుచుకోవడం తప్పనిసరి. 

పచ్చి మిరపకాయలు  - 12

జీలకర్ర  -  ముప్పావు స్పూను.

ఉప్పు  - తగినంత. ఉప్పు షుమారుగా జాగ్రత్తగా  వేసుకోవాలి . ఉప్పు కొద్దిగా  తగ్గినా పర్వాలేదు . కాని ఎక్కువైతే  వడియాలలో ఉప్పు ఎక్కువై  రుచి పాడవుతుంది.
  
తయారీ  విధానము .

బియ్యపు పిండి  పట్టించిన రోజు ఉదయం ఒక గిన్నెలో  పిండి కొలత ప్రకారము  ఒక గ్లాసు  బియ్యపు పిండికి  ఆరు గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకోవాలి.

స్టౌ  మీద కొలుచుకున్న నీళ్ళ గిన్నెను పెట్టి  నీళ్ళను బాగా  తెర్ల నివ్వాలి.

ఒక గిన్నెలో  గ్లాసు బియ్యపు పిండి  వేసుకుని  అందులో  ఒక  గ్లాసు నీళ్ళు  పోసుకుని  చేతితో  బాగా  కలుపుకోవాలి.

పచ్చి మిరపకాయలు , జీలకర్ర  మరియు తగినంత  ఉప్పు మిక్సీలో మెత్తగా  వేసుకుని  విడిగా ఉంచుకోవాలి.

నీళ్ళు కళా పెళా తెర్లుతున్నప్పుడు  జీలకర్ర , పచ్చిమిర్చి  పేస్ట్ ను వేసి గరిటెతో  బాగా  కలుపుకోవాలి.

వెంటనే  విడిగా నానబెట్టిన  బియ్యపు పిండిని  కూడా వేసుకుని  స్టౌ మీడియం సెగలో పెట్టుకుని  దగ్గరే ఉండి  పిండి ఉండకట్టకుండా మరియు అడుగంటకుండా బాగా  ఉడికి చిక్కగా  దగ్గర పడే  వరకు గరిటెతో  బాగా కలుపుతుండాలి.

ఒక పది నిముషాలు ఉడికిన పిండిని  చల్లారనివ్వాలి.

ఎందుకంటే  వేడి మీద వడియాలు పెడితే వడియాలు  మైనపు కాగితానికి   అంటుకుని ఒక పట్టాన ఊడి రావు. ఎండాక ముక్కలుగా  విరిగి పోతాయి.

కొద్దిగా చల్లారిన తర్వాత  ఎండలో ఒక  మైనపు పట్టాను  పర్చుకుని , ఒక గరిటెతో  కాచిన బియ్యపు పిండిని  గుండ్రముగా వడియాలు వీలయినంత  పల్చగా పెట్టుకోవాలి.

ఉదయం ఎంత తొందరగా పని పూర్తి చేసుకుంటే ఒక గంటలో వడియాలు పెట్టుకునే పని పూర్తవుతుంది.

కాకపోతే  ఇక్కడ  తడి బియ్యాన్ని మరలో పిండి  పట్టించుకోవడం త్వరగా చేసుకుంటే వడియాల పెట్టే పని ఎండలో అలసి పోకుండా  త్వరగా అవుతుంది.

ముందు రోజు మధ్యాహ్నమే  బియ్యము నాన పోసుకుని సాయంత్రానికి  పిండి పట్టించుకుని , ఒక గిన్నెలో ఆ పిండి  నొక్కి  పెట్టి ఉంచి  ఉదయాన్నే  పిండితో  వడియాలు  పెట్టుకుంటే  పని  త్వరగా  పూర్తవుతుంది,

సాయంత్రానికి  పట్టాను మడత పెట్టి మరుసటి రోజు ఉదయాన మళ్ళీ ఎండబెట్టు కోవాలి.

మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా వడియాలు పట్టా నుండి వాటంతట అవే ఊడివస్తాయి.

మూడో రోజు కూడా వడియాలను ఎండబెట్టుకుని ఒక టిఫిన్లో పోసుకుని మూత పెట్టుకోవాలి.

ఈ  బియ్యపు పిండి  వడియాలు  నిక్షేపంగా  పూర్తిగా  ఏడాది పాటు  నిల్వ ఉంటాయి.

అవసరమైనప్పుడు  కాసిని కాసిని వడియాలు తీసుకుని  వేయించుకోవచ్చును.

సగ్గు బియ్యము వడియాలు లాగా  ఈ బియ్యపు పిండి  వడియాలు కూడా చాలా రుచిగా  ఉంటాయి.

అంతే . ఎంతో రుచిగా  ఉండే  బియ్యపు పిండి వడియాలు భోజనములోకి పక్కన ఆదరువుగా మరియు మధ్యాహ్నము  అల్పాహారమునకు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో తయారుచేయు  సమయమున తీసినది.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి