Thursday, June 1, 2017

వేడి వేడి ఉల్లి పకోడీలు .

వేడి వేడి ఉల్లి పకోడీలు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

మేము శనగపిండి బజార్లో కొనము .
ఏ పిండి శనగ పిండి లో కలుపుతారో మాకు తెలియదు .
కాని బజార్లో శనగపిండి తో చేసుకుంటే రుచిగా ఉండటం లేదు .
అందువలన ఒక కే . జి . పచ్చి శనగపప్పు కొని పిండి పట్టించు కుంటాము .
అయిపోయాక మళ్ళీ కే. జి . పట్టించుకుంటాము .
మాకు అయితే కొన్న పిండికి , మేము పట్టించిన పిండితో చేసిన వంటకాలకు తేడా స్పష్టంగా తెలుస్తోంది .
తయారీ విధానము .
రెండు ఉల్లి పాయలు చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
అయిదు పచ్చి మిరపకాయలు చాలా సన్నగా తరుగు కోవాలి .
ఒక అరకట్ట కొత్తిమీర , మూడు రెమ్మలు కరి వేపాకు చాలా సన్నగా తరుగు కోవాలి .

ఇప్పుడు ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి , కరివేపాకు , కొత్తిమీర వేసి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా కలుపుకోవాలి .
ఉల్లిపాయల ముక్కలన్నీ బాగా కలసి తడి వస్తుంది .
ఇప్పుడు పావు కప్పు శనగపిండి , చాలా కొద్దిగా అంటే చిటికెడు వంట సోడా వేసి చాలా కొంచెం నీళ్ళు పోసి ముక్కలు పిండి బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి ఓ 150 గ్రాముల నూనె పోసి నూనె బాగా కాగగానే చిన్న చిన్న పకోడీల లాగా వేసుకుని , బంగారు రంగు వేపు రాగానే విడిగా తీసుకోవాలి .
ఉల్లిపాయల తీపి తగలాలని , కమ్మగా ఉండాలని మేము ఇందులో కారం , బియ్యపు పిండి అసలు వేసుకోము .
పచ్చి మిర్చి కారం సరిపోతుంది .
అన్నం లోకి ఆదరువు లేనప్పుడు ఇలా ఉల్లి పకోడీలు మరియు చారు పెట్టుకొని ఆ పూటకి ముగించేస్తాము .
అంతే కరివేపాకు మరియు కొత్తిమీర రుచితో వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు మధ్యాహ్నము వేళ అల్పాహారమునకు సిద్ధం .
ఫోటో --- ఈ రోజు మధ్యాహ్నము 3 గంటలకు మా అల్పాహారము గా వేసుకున్న ఉల్లిపాయ పకోడీలు .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి