Thursday, April 16, 2020

బెల్లం‌ ఆవకాయ

ఆంధ్రా స్పెషల్ - బెల్లం  ఆవకాయ.

ఆలూరుకృష్ణప్రసాదు

 శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్టణం , తూర్పు గోదావరి మరియు  పశ్చిమ  గోదావరి జిల్లాల వారు  ఈ బెల్లం ఆవకాయ ఏడాది నిల్వ ఊరగాయను ఎక్కువ మంది  పెట్టుకుంటారు.

మిగిలిన ఆంధ్ర ప్రాంతం వారు చాలా తక్కువగా  పెట్టుకుంటారు.

మేము  ఆవకాయ , మాగాయలతో పాటుగా  ఈ బెల్లం  ఆవకాయను ప్రతి సంవత్సరం  తప్పనిసరిగా  పెట్టుకుంటాం.

నా ఊహ తెలిసినప్పటి నుండి  అంటే  షుమారు 60 సంవత్సరాల  పై నుండీ  మా ఇంట్లో  తప్పనిసరిగా  బెల్లం  ఆవకాయను ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము.
ఈ బెల్లం  ఆవకాయ నిక్షేపంగా  ఏడాదిన్నర కూడా నిల్వ ఉంటుంది.

అందుకు ప్రధాన కారణం  మూడు రోజులు ఈ బెల్లం  ఆవకాయను ఎర్రటి  ఎండలో పెడతాము . అందువలన  ఈ బెల్లం ఆవకాయ పాడవదు.

చాలామంది  పై తెలిపిన ప్రాంతాల వారు కాకుండా  ఇతర ప్రాంతాల వారు , దాని రుచి తెలియని వారు " ఆవకాయ లో బెల్లం  ఏమిటి ? " అని మొహం చిట్లిస్తారు. అలా అనే వారు ఈ ఆవకాయ రుచి చూడని వారు మాత్రమే అని  నా అభిప్రాయం.

మేం గుంటూరు జిల్లా లో ఉన్నా ,   మేం తప్పనిసరిగా  ప్రతి సంవత్సరం  పెట్టుకుంటాం కనుక  , మా అన్నదమ్ముల స్నేహితులు , మా ఇరుగు పొరుగు  చుట్టు ప్రక్కల వారు  అందరికీ  మా వల్ల ఈ బెల్లం ఆవకాయ  అలవాటు  చేసాము. వారందరికీ  ఎంతో నచ్చింది.

ప్రతి ఏడు మా అమ్మని ప్రత్యేకంగా  అడిగి  కనీసం ఒక చిన్న హార్లిక్స్  సీసాడు  బెల్లం ఆవకాయ పట్టుకు వెడతారు.

ప్రస్తుతం  మేము తెనాలి లో ఉంటున్నాం కనుక మేము బెల్లం  ఆవకాయ పెట్టుకుంటాం అని తెలిసిన మా స్నేహితులందరూ ప్రత్యేకంగా  అడిగి  మరీ  ఒక చిన్న హార్లిక్స్ సీసాడు బెల్లం  ఆవకాయ పట్టుకుని వెడతారు. తిన్నారా ఎలా ఉంది ? అని అడిగితే " మేము ఇద్దరం  తింటే అయిపోతుంది కదండీ. బెంగుళూరులో ఉంటున్న మా అబ్బాయికి  మీ బెల్లం  ఆవకాయ చాలా ఇష్టం. అందువల్ల వాడికి  పంపాము " అని అంటారు.

ఇదంతా నేను ఎందుకు  చెబుతున్నానంటే  తినని వాళ్ళకు , తినడానికి  ఇష్ట పడని వాళ్ళకే ఈ బెల్లం ఆవకాయ నచ్చదు. ఒకసారి తిని దాని రుచి తెలుసుకున్న వాళ్ళు ఏ ప్రాంతం వారయినా  తినకుండా  ఉండలేరు.

మా చిన్నతనంలో  మా అమ్మ  రెండు పెద్ద జాడీల నిండా అంటే షుమారు ఓ 50 మామిడి కాయలతో ఈ బెల్లం ఆవకాయ పెట్టేది. అమ్మది  భారీ చెయ్యి. పెట్టిన నాలుగో రోజు నుండి  మూడు రోజులు మేడ మీద ఎండలో  పెట్టేది.

మా స్నేహితులు , మా అన్నదమ్ముల స్నేహితులు  మాతో ఆడుకోవడాని కనే మిషతో  మా ఇంటికి  వచ్చి మేడ మీద జాడీ లో  ఎండ బెట్టిన బెల్లం  ఆవకాయ ముక్కలను చేతితో తీసుకుని  ' హాంఫట్ హాంఫట్ ' అంటూ తినేసేవారు. మా అమ్మకు  తర్వాత తెలిసి  ' ఏ చేతులతో పడితే ఆ చేతులతో  ఆవకాయలు ముట్టుకోకూడదు. ఏడాది పచ్చళ్ళు పాడవుతాయి ' అని కోప్పడేదనుకోండి. ఇవి మా గుంటూరు జిల్లాలో మాఅందరికీ మా స్నేహితులతో  ఈ బెల్లం ఆవకాయ మధుర జ్ఞాపకములు.

ఇక  అసలు విషయానికి  వద్దాము.

బెల్లం ఆవకాయ.
************

మేము మరియు లోగడ మా అమ్మమ్మ మరియు  కాకినాడ  లో ఉన్న మా బంధువులు  అందరూ ఈ బెల్లం  ఆవకాయ పెట్టుకోవడానికి  కలెక్టరు మామిడి / చిత్తూరు మామిడి / తోతాపురి (  ఈ మూడు పేర్లు  ఒకటే కాయ )  కాయనే  వాడతారు. ప్రధాన కారణం  ఈ బెల్లం  ఆవకాయ పెట్టుకోవడానికి  ఈ కాయ బాగుంటుందనే వారు.

ఈ చిత్తూరు మామిడి కాయ లేత కాయ కాకుండా  బాగా తయారయ్యి లోపల టెంక మరియు పీచు ఉన్న కాయలనే ఎంచుకునే వారు. కాయ అసలు పండకుండా బాగా గట్టిగా ఉండాలి.

అలాగే  బెల్లం  ఆవకాయలో వాడే బెల్లం  కూడా  మామూలుగా  మనం ఇళ్ళల్లో  వాడే బెల్లం  కాకుండా , మేము కాకినాడ  ప్రాంతం వారమే కాబట్టి  షుమారు నెలరోజుల ముందే అంటే  కాయ రాకముందే ప్రత్యేకంగా  ' బూరుగు పల్లి '  బెల్లం  ఒక మూడు కిలోలు  తెప్పించుకునే వారము . కాకినాడ పెద్ద మార్కెట్ దగ్గర  కల  పచారీ  షాపులలో  బెల్లం ఆవకాయకు  బూరుగు పల్లి బెల్లం  కావాలని  అడిగితే  ఇచ్చే వారు.

ఇప్పుడు  తెనాలిలో ఉన్నా  ప్రతి సంవత్సరం  బెల్లం  ఆవకాయ కోసం కాకినాడ  నుంచి  బంధువుల ద్వారా బూరుగపల్లి బెల్లం తెప్పించుకుంటాము.

కావలసినవి.

చిత్తూరు  మామిడి  కాయలు  -  10  కాయలు.
( షుమారుగా  రెండున్నర  కిలోల ముక్కలు వస్తాయి . )

బూరుగు పల్లి  బెల్లం  లేదా  దొరకనిచో మామూలు బెల్లం  --  ఒక  కిలో లేదా కిలోం పావు  బెల్లం తీసుకుని  రోటిలో దంపుకుని ఒక కిలో బెల్లం పొడి వచ్చే విధముగా  సిద్ధం చేసుకోవాలి.

కారము , ఉప్పు , ఆవపిండి - మూడు కలిపి   --  ఒక కిలో.

ఇందులో  -

కారము  -  400 గ్రాములు.
ఆవపిండి - 350 గ్రాములు.
మెత్తని ఉప్పు - 250 గ్రాములు.
( అయోడైజ్డ్  కానిది . )

ఈ మూడు పైన తెలిపిన పాళ్ళలో తీసుకుని  ఒక బేసిన్  లో వేసుకుని  చేతితో  బాగా కలుపుకొని  విడిగా  ఒక  జాడీలో కాని జార్ లో కాని పోసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి.

పసుపు  -  స్పూనున్నర .

మెంతులు  -  స్పూనున్నర .

చింతపండు  -  నిమ్మకాయంత  తీసుకుని శుభ్రం  చేసుకుని , గింజలను  తీసి వేసి విడదీసుకుని  రోటిలో  తొక్కి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి.

బెల్లం  ఆవకాయ సిద్ధ మయ్యాక   --

పోపునకు  --

సామర్లకోట  A . S . Brand నువ్వు పప్పు నూనె  -  పావు కిలో.

ఎండుమిరపకాయలు  - 12

వెల్లుల్లి  పాయలు  -  150 గ్రాములు.

వెల్లుల్లి పాయలు  విడదీసి  రెబ్బలు మీద పొట్టు అంతా  తీసుకుని   సిద్ధం చేసుకోవాలి. 

ఆవాలు  --  రెండు  స్పూన్లు .

తయారీ విధానము.

బాగా తయారయ్యి  టెంక  పట్టి  అసలు పండకుండా గట్టిగా  ఉన్న చిత్తూరు మామిడి  కాయలు  ఒక  పది కాయలు తీసుకోవాలి.

వాటిని ఒక  టబ్ లో నీటిలో వేసుకుని  ఒక  అరగంట సేపు నీటిలో నాన నివ్వాలి.

తర్వాత  ఒక్కొక్క  కాయను తీసుకుని  పొడిగా  గుడ్డతో కాయలను శుభ్రంగా తుడుచు కోవాలి. మరో అరగంట సేపు కాయలను  పొడిగా  ఆర నివ్వాలి.

తర్వాత  మామిడి  కాయల మీద ఉన్న చెక్కును పీలర్ తో కాని  లేదా కత్తి పీటతో కాని లేదా ఆల్ చిప్పతో కాని తీసుకోవాలి . మొత్తము  అన్ని కాయల మీద పై చెక్కును తీసుకోవాలి .

ముందు కాయను మధ్యలో సగానికి  తరుకుని  టెంకలోని పై పొట్టు తీసి వేయాలి. ఇలా అన్ని కాయలకు  తీసి వేయాలి.

తర్వాత  మామూలుగా  ఆవకాయ పెట్టడానికి  ముక్కలు ఏ విధముగా  తరుగుతామో  అదే విధముగా  ప్రతి ముక్క పైన టెంక వచ్చే విధముగా  ముక్కలను తరుగు కోవాలి.

ఇప్పుడు  ఒక పెద్ద బేసిన్ తీసుకుని  తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  మామిడి  కాయ ముక్కలను  బేసిన్ లో వేసుకోవాలి.

అందులో స్పూనున్నర  పసుపు వేసుకుని ముక్కలకు పట్టే  విధముగా  బాగా కలుపు కోవాలి.

కారం , ఆవపిండి  మరియు  ఉప్పు  ఈ మూడు కలిపి  సిద్ధంగా  ఉంచుకున్న  కిలో గుండను  మరియు  స్పూనున్నర  మెంతులు  ముక్కలలో వేసుకుని గుండ ముక్కలకు పట్టే విధముగా  బాగా కలుపు కోవాలి.

ఇప్పుడు సిద్ధంగా  ఉంచుకున్న  ఒక  కిలో బెల్లం  పొడి  మరియు చిన్న చిన్న బిళ్ళలను చేసి సిద్ధంగా  ఉంచుకున్న  చింతపండును కూడా  అందులో వేసి చేతితో బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు  ఈ కలిపిన మిశ్రమము మరియు ముక్కలు  మొత్తము  ఒక  పెద్ద జాడీలో పెట్టుకుని  గట్టిగా  మూత పెట్టుకోవాలి.  ఒక ప్రక్కన కదపకుండా  పూర్తిగా  మూడు రోజులు  ఉంచాలి.

ఇలా  ఉంచడం బెల్లం  మరియు ముక్కలకు  ఆవకాయలో తడి బాగా  వస్తుంది.

పూర్తిగా  మూడు రోజులు  కదపకుండా  ఉన్న  పిదప  నాలుగవ  రోజు ఆవకాయను  చెక్క గరిటె తో బాగా కలుపు కోవాలి.

ఈ బెల్లం  ఆవకాయ  అంతా  ఒకటి లేదా రెండు  బేసిన్  లలో  పోసుకుని  ఉదయం  9 గంటల నుండి  సాయంత్రం  5  గంటల  వరకు  పూర్తిగా  మూడు రోజులు ఎర్రటి  ఎండలో  పెట్టాలి. ప్రతి రోజు ఎండలో నుండి తెచ్చాక చెక్క గరిటెతో ఆవకాయ  బాగా కలుపు తుండాలి.

ఇలా  పూర్తిగా  మూడు రోజులు  ఎండబెట్టినందువలన  పచ్చడి  లోని పాకం పూర్తిగా  గట్టి పడుతుంది. ఆవకాయ లోని  తడి అంతా  పోతుంది. ప్రతి ముక్కకు  తీపి  కారము మొత్తము  సమంగా పట్టుకుంటాయి.  పచ్చడి  పూర్తిగా  దగ్గర  పడుతుంది.

మీరు కొద్దిగా  ఆవకాయ పెట్టుకున్నా  లేదా  ఎండలు  విపరీతంగా  ఉన్నా  ఆవకాయ రెండు  రోజులు ఎండబెట్టితే  సరిపోతుంది .  అటువంటప్పుడు  మరీ ఎక్కువగా  ఎండితే  ఆవకాయ మరీ  ఎండి పోయి  పిడస కట్టినట్లుగా  అయి పోతుంది. మీరు మాత్రం ఈ విషయము  జాగ్రత్తగా   గమనించుకోవాలి.

పూర్తిగా  మూడు రోజులు  ఎండ బెట్టిన తర్వాత  ఆ రోజు  సాయంత్రం బెల్లం  ఆవకాయ లో  పోపు పెట్టుకోవాలి.

ఒక  వెల్లుల్లి  వేసి పోపు పెడితే  బెల్లం  ఆవకాయ ని అంటారని , వెల్లుల్లి తో పాటుగా  ఎండుమిరపకాయలు  , ఆవాలు మరియు కరివేపాకును  వేసి పోపు పెడితే  దప్పళపు ఆవకాయ  అంటారని  మా అమ్మమ్మ  వాళ్ళు చెప్పారు.

ఇక మూడవ రోజు  సాయంత్రం  ఎండలో నుండి  తెచ్చిన  బెల్లం  ఆవకాయలో  పోపు  పెట్టుకునే  విధానము.

స్టౌ  మీద  బాండి  పెట్టి  మొత్తము  పావు కిలో  పప్పు నూనెను  బాండీలో పోయాలి.

బాండిలో నూనె బాగా కాగగానే  తొడిమలు  తీసిన  ఎండుమిరపకాయలు , ఆవాలు  మరియు కరివేపాకును  వేసి పోపును వేగ నివ్వాలి.  అందులోనే  ఒలిచి  సిద్ధంగా  ఉంచుకున్న  వెల్లుల్లి పాయలు కూడా  వేసుకుని  వెల్లుల్లి  పాయలు  బంగారు రంగులో  వచ్చే వరకు  వేయించు కోవాలి.

ఈ వేగిన  పోపును  వేడిగానే  బెల్లం  ఆవకాయ లో  వేసుకుని  చెక్క గరిటెతో  బాగా కలుపు కోవాలి.

చల్లారగానే  తిరిగి  జాడీలోనికి  తీసుకుని  జాడి పైన  వాసిన కట్టుకుని  భద్రపరుచుకోవాలి.

కావలసినప్పుడు   చిన్న జాడీల లోకి తీసుకుని   వాడుకొనవచ్చును .

అంతే. ఇడ్లీల లోకి , దోశెల లోకి , గారెల లోకి , రోటీల లోకి , చపాతీల లోకి  మరియు  భోజనము  లోకి  అద్భుతమైన  రుచిగా  ఉండే  బెల్లం  ఆవకాయ  సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధించిన  రెసిపీ మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటోలు  తయారుచేయు  సమయమున తీసినది.
ఆలూరుకృష్ణప్రసాదు .
ముఖ్య గమనిక  --

మేము ఈ బెల్లం ఆవకాయకు  మామిడి కాయల  పై  చెక్కు తీస్తాము.
మీరు  కావాలిస్తే  పై చెక్కు తో ముక్కలు తరుగు కోవచ్చును.

మేము  చిత్తూరు  మామిడి కాయలతోనే  ఈ బెల్లం  ఆవకాయ పెడతాము.
మీరు  మామూలుగా  ఆవకాయ పెట్టే కాయలతో  కూడా  బెల్లం  ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  బూరుగు పల్లి  బెల్లమే  బెల్లపు  ఆవకాయ  తయారు చేయడానికి  వాడతాము.
మీరు మీకు మార్కెట్లో  దొరికే  ఏ రకమైన బెల్లంతో నైనా  బెల్లం ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  ఈ బెల్లం  ఆవకాయలో  వెల్లుల్లి  పాయలు  వేసుకుంటాము .
మీరు వెల్లుల్లి  వేయకుండా  బెల్లం  ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  ఈ బెల్లం  ఆవకాయలో  ఇంగువ  వేసుకోము.
మీరు కావాలనుకుంటే  ఇంగువ  వేసుకోవచ్చును.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి