ఆలూరుకృష్ణప్రసాదు .
మెంతికూర .
ఆరోగ్యానికి మెంతికూర.
మధు మేహా వ్యాధి నియంత్రణకు , శ్వాస కోశ , మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు మెంతికూర ఆహారంలో తీసుకోవడం చాలా ఉపయోగకరం.
మాములుగా ఆకులుగా పెద్ద కట్టాలుగా దొరికే మెంతికూర, బాపట్ల మరియు కొన్ని ప్రాంతాలలో దొరికే చిన్న చిన్న కట్టలుగా దొరికే మెంతికూర .
రోజూ బాపట్ల నుండి తెనాలి కి ప్రతిరోజూ మధ్యాహ్నము రైలులో ఈ చిన్న కట్టల మెంతికూర తెచ్చి అమ్ముతారు .
సంవత్సరంలో బాగా ఎండలున్న మూడు నెలలు తప్ప ఈ చిన్న కట్టల మెంతికూర మాకు మిగిలిన తొమ్మిది నెలలు దొరుకుతుంది .
ఆహార పోషక విలువల లో రెండు ఒకటే అయినా మేము చిన్న చిన్న కట్టల మెంతికూరనే వాడతాము .
చాలా చాలా రుచిగా ఉంటుంది .
మెంతికూరతో ఏమి చెయ్యవచ్చు ?
1. మెంతి కూర పప్పు కందిపప్పుతో.
2. మెంతికూర పప్పు కూర పచ్చిశనగపప్పు తో.
3. మెంతికూర పొడి కూర కందిపప్పు తో.
ఇవి కాక మేతి చపాతీలు , మేతి పరోటాలు చాలా రకాలు చేస్తారు .
కొందరు మెంతికూరతో పచ్చడి కూడా చేసుకుంటారు.
ఇప్పుడు నేను చెప్తున్నది
మెంతికూర కందిపప్పు తో పొడికూర .
మెంతికూర కందిపప్పు తో పొడికూర తయారు చేయు విధానము.
ముందుగా ఒక గ్లాసు కందిపప్పు
ఒక గిన్నెలో పోసుకుని ఒకసారి కడిగి , ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసి స్టౌ వెలిగించి మరీ మెత్తగా కాకుండా బద్దలుగా ( చేతితో నొక్కి చూస్తే బద్ద మెత్త పడితే చాలు ) ఉడికించండి .
ఉడికిన నీళ్ళు మిగిలితే ఒక గిన్నెలో వార్చుకోండి .పార బోయవద్దు .
బద్దలుగా ఉడికిన పప్పు ఒక పళ్ళెంలో పక్కన పెట్టుకోండి .
మెంతి కూర చిన్న కట్టలయితే వేళ్ళు చాకుతో కట్ చేసి కాడలు కూడా లేతగా ఉంటే ఉంచండి .
ఆకు మరియు కాడలు చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత రెండు సార్లు శుభ్రంగా కడగండి .
మా బాపట్ల ఇసుక నేల కాబట్టి ఏ ఆకు కూర లో నైనా ఇసుక తగులుతుంది .
బాగా కడగపోతే కూరలో ఇసుక తగిలి గర గర మంటుంది. రుచి పాడవుతుంది.
అదే పెద్ద మొక్కల మెంతికూర అయితే ఆకులు వలుచుకుని కట్ చేసుకుని ముదురు కాడలు పారేసి ఆకును శుభ్రంగా కడుక్కోండి.
ఇప్పుడు స్టౌ వెలిగించి బాండీ పెట్టి నాలుగు టీ స్పూన్ల నూనె వేయండి .
నూనె బాగా కాగాక నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలు చేసినవి , రెండుస్పూన్ల చాయమినపప్పు , అర స్పూన్ జీలకర్ర , అర స్పూన్ ఆవాలు , తగినంత ఇంగువ , రెండు రెమ్మల కరివేపాకు వేసి పోపు బాగా వేగాక , తరిగి ఉంచుకున్న మెంతికూర ఆ పోపులో వేయండి .
అందులో పావు స్పూన్ పసుపు కూడ వెయ్యండి.
మెంతికూర తొందరగానే మగ్గుతుంది.
మెంతికూర మగ్గిన తర్వాత ఇప్పుడు బద్దలుగా ఉడికించిన కందిపప్పు కూడా అందులో వేసి ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకుని మూడు నిముషాల పాటు మగ్గనిచ్చి దింపేసి వేరే Bowl లోకి తీసుకోండి .
అంతే ఆరోగ్య కరమైన మరియు రుచికర మైన మెంతికూర పొడికూర భోజనం లోకి సిద్ధం.
ఇదే పద్దతి లో కందిపప్పు బదులు శనగపప్పు వేసి కూడా మెంతికూరతో పొడికూర చేసుకోవచ్చు .
కొంతమంది పోపులో మెంతికూర వేయిస్తే విటమిన్ లు పోతాయని ఉడుకుతున్న కందిపప్పు లోనే తరిగి ఉంచుకున్న మెంతికూర వేసి రెండూ ఉడికాక , పైన నే చెప్పిన పద్ధతిలో పోపు , ఉప్పు , కారం వేసుకుంటారు .
మెంతికూర పప్పు .
--------------------
గ్లాసు కందిపప్పు తగినంత నీళ్ళుపోసి స్టౌ మీద పెట్టాలి .
పప్పు మెత్తగా ఉడకగానే పప్పులో మెంతికూర , తరిగి ఉంచుకున్న అయిదు పచ్చి మిరపకాయలు ముక్కలుగా చేసుకుని , కొంచెం పసుపు, రెండు రెమ్మలు కరివేపాకు వేసి మెంతికూర ఆకు ఉడికాక చిన్న నిమ్మకాయంత చింతపండు చిక్కగా రసం తీసుకుని పప్పు లో వేయాలి .
తర్వాత తగినంత ఉప్పు , స్పూనున్నర కారం వేసి పైన చెప్పిన విధంగానే పోపు పెట్టుకోవచ్చు.
ఇంక ఇందాక పప్పు నీళ్ళు మిగిలితే ఏం చెయ్యాలి ?
పప్పు కట్టు చేసుకోవచ్చు.
ఆ నీళ్ళలో అర గరిటెడు ఉడికిన పప్పు కలిపి కొద్దిగా ఉప్పు కలిపి ,
కొద్దిగా పసుపు వేసి ఎండు మిరపకాయలు , ఆవాలు , జీలకర్ర ,
ఇంగువ , కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే బలవర్ధక మైన పప్పు కట్టు రెడీ.
మీకు పప్పు కట్టు చప్పగా అన్పిస్తే
కొద్దిగా నిమ్మరసం పిండుకోండి .
ఫోటోలు .
కందిపప్పు తో మెంతికూర పొడికూర మరియు మెంతికూర పప్పు .
బాపట్ల మెంతికూర .
పచ్చిశనగపప్పు తో మెంతికూర పొడి కూర .