Thursday, March 1, 2018

మసాలా పెసర పుణుకులు

మసాలా పెసర వడలు  లేదా మసాలా పెసర పుణుకులు .

కావలసినవి.

పచ్చ పెసలు  లేదా  మామూలు పెసలు  --  పావు కిలో
పచ్చిమిర్చి  --  12 
అల్లం  --  షుమారు  రెండంగుళాలు ముక్క
పై  చెక్కు తీసుకుని
ముక్కలు గా చేసుకోవాలి .

ఉల్లిపాయలు  --  రెండు . సన్నని  ముక్కలుగా  తరుగు కొవాలి .

కరివేపాకు  --  మూడు రెమ్మలు . సన్నగా  తరుగు కోవాలి .

కొత్తిమీర  --  ఒక కట్ట  సన్నగా  తరుగు కోవాలి .

పొదినా  ఆకు   అరకప్పు  --  సన్నగా  తరుగు కోవాలి .

ఉప్పు  --  తగినంత

నూనె  --  అర కిలో

తయారీ  విధానము .

ముందుగా   పెసలు   సరిపడా  నీళ్ళు  పోసి  నాలుగు  గంటల  సేపు  నానబెట్టు కోవాలి .

ఆ తర్వాత నీళ్ళు  వడకట్టు కోవాలి .

ఇప్పుడు  గ్రైండర్ లో కాని  మిక్సీ లో కాని  నాన బెట్టిన  పెసలు , పచ్చి మిర్చి , అల్లం  ముక్కలు మరియు  సరిపడ ఉప్పు వేసి  తగినన్ని  నీళ్ళు పోసుకుంటూ  గారెల పిండి మాదిరిగా   గట్టిగా  వేసుకుని  ఒక  గిన్నెలోకి తీసుకోవాలి .

ఇప్పుడు  అందులో  సన్నగా  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  కరివేపాకు , తరిగిన  కొత్తిమీర  మరియు తరిగిన  పొదినా  వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టుకుని  మొత్తం  నూనె పోసి  నూనె పొగలు వచ్చే  విధముగా  కాగనివ్వాలి .

తర్వాత  పిండిని  అర చేతితో  అద్దుకుని  వడలు  లాగా వేసుకుని  బంగారు  రంగులో  వేయించుకోవాలి .

లేదా  చిన్న చిన్న పుణుకులు లా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మసాలా పెసర వడలు  లేదా  మసాలా పెసర పుణుకులు  మధ్యాహ్నము  అల్పాహారమునకు  సిద్ధం .

ఈ వడలు లేదా పుణుకులు  వేడి వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  నంచుకుని  తినవచ్చు .

చాలా రుచిగా ఉంటాయి .

పెసర పప్పు పచ్చడి

పెసర పప్పు పచ్చడి.
( కొద్ది మార్పులతో  )

చాయపెసరపప్పు  -- 100  గ్రాములు.
పచ్చిమిరపకాయలు  --  6
ఎండుమిరపకాయలు  --  2
జీలకర్ర  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
నిమ్మకాయ  -- ఒకటి .
కట్ చేసుకుని  రసము తీసుకోవాలి .
కొత్తిమీర  --  చిన్న కట్ట

పోపుకు.

నెయ్యి  --  రెండు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  రెండు 
చాయమినపప్పు --  స్పూను
ఆవాలు  --  అర స్పూను.
కరివేపాకు  --  రెండు రెమ్మలు.

తయారీ విధానము .

ముందుగా  చాయపెసరపప్పును  ఒక గిన్నెలో  వేసుకుని  తగినన్ని  నీళ్ళు  పోసి   రెండు గంటల సేపు  నానబెట్టాలి.

తర్వాత  నీరును  వడకట్టు కోవాలి .

తర్వాత  నానబెట్టిన  చాయపెసరపప్పు ,  జీలకర్ర , పచ్చిమిర్చి , ఎండుమిర్చి , పచ్చి ఇంగువ , తరిగిన  కొత్తిమీర  వేసి , తగినన్ని  నీరు  పోసుకుని   మరీ  మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  పచ్చడిని  ఒక గిన్నెలోకి  తీసుకుని  నిమ్మరసం  వేసుకుని  స్పూనుతో బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని రెండు  ఎండుమిర్చి  ముక్కలు చేసుకుని , చాయ మినపప్పు  ,ఆవాలు  మరియు  కరివేపాకు  వేసుకుని  పోపు వేసుకుని  పచ్చడిలో  వేసుకుని,   స్పూను తో   బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే  పెసరపప్పు  పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.

నెయ్యి వల్ల లాభాలు

మల్లిఖార్జున్ బోడ్లా .

నెయ్యి వాడకం వలన ప్రయోజనములు .

హాయిగా నెయ్యి తినండి ఆయుష్షు పెంచుకోండి..

“నెయ్యా! అమ్మో! వద్దు.. బరువు పెరుగుతాం, ఒళ్ళొచ్చేస్తుంది”.. నూటికి 90 శాతం ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. ఎందుకంటే జనం కూడా నెయ్యిని కొలెస్ట్రాల్ కి ప్రతిరూపంలా ఫీలవుతున్నారు. చాలామంది టీవీల్లో చెప్పేవి.. పుస్తకాల్లో, పేపర్లలో రాసేవి చూసి, సగం సగం నాలెడ్జ్ తో నమ్మేసి అదే నిజం అనుకుని, గుండెజబ్బులనేవి నెయ్యి తినడం వల్లే వస్తాయని ఫిక్స్ అయిపోతున్నారు. ఇవేమీ నిజం కాదు. ఆయుర్వేదం ‘నెయ్యి’ అమృతంతో సమానం అని చెప్పింది. అంతేకాదు మోడ్రన్ సైన్స్ కూడా నెయ్యి వల్ల చాలా ఉపయోగాలున్నాయని రీసెర్చ్ చేసి మరీ చెప్పింది..

నెయ్యిలో ఉండే ఈ రెండూ K2 , CLA (Conjugated Linoleic Acid) యాంటి యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి అని ఎంతమందికి తెలుసు.

నెయ్యి తింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోవడమే కాదు ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. నెయ్యి వల్ల గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండ‌వు. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వాళ్ళు, నెయ్యిని త‌మ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విట‌మిన్ “ఎ” పుష్క‌లంగా ల‌భించి నేత్ర స‌మ‌స్య‌లు తగ్గుముఖం పడతాయి.

నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే అపోహ ఉంది. అయితే నిజానికి నెయ్యి వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరగదు.. నెయ్యి మంచి కొలెస్ట్రాల్‌ నే పెంచుతుంది. అందువల్ల నెయ్యివల్ల గుండజబ్బులు రావు. గుండెజబ్బులకి వేరే కారణాలు కీలకం కావచ్చు. గ‌ర్భిణీ మ‌హిళ‌లైతే నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే ఎన్నో పోషకాలు గ‌ర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే పిల్లలకి ల‌భిస్తాయి.

నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు నిర్ధారించాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి. ముఖం మీద వచ్చే ప్రతివాటికీ నెయ్యి కారణం అని మాత్రం అనుకోవద్దు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా నిర్భ‌యంగా నెయ్యిని తిన‌వ‌చ్చు. అయితే అతి అనర్ధదాయకం.

నెయ్యిలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ వల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు తగ్గడమే కాదు రకర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది. రోజూ ఆహారంలో తప్పనిసరిగా నెయ్యిని తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఆయుర్వేదం “నెయ్యి” పాజిటివ్ ఫుడ్‌ అని చెప్తోంది. అంతేకాదు ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు శ‌రీరానికి ఎంతో మంచిది అని వివరణ కూడా ఇచ్చింది. అంతెందుకూ శ‌రీరంపై కాలిన గాయాలు ఉంటే, కొద్దిగా నెయ్యిని ఆ ప్రాంతంలో రాసి చూడండి.. దీంతో ఆ గాయం ఇట్టే తగ్గిపోవడం గమనించవచ్చు.

ఎంతో ఉపయోగకరమైన రుచిగా ఉండే మన నెయ్యిని.. మనం ఇష్టపడటం మానేసి, ఇతరదేశాలవాళ్ళు, వాళ్ళ ఆయిల్స్ గురించి పాజిటివ్ గా ప్రచారం చేస్తుంటే, వాళ్ల అమ్మకాలని పెంచుకుంటుంటే వాటిని మనం ఆహా ఓహో అని మెచ్చేసుకుంటున్నాం.. అధిక బరువుకి, కొలెస్ట్రాల్ పెరగడానికి, గుండె జబ్బులు రావడానికి నెయ్యి కారణం కాదు. స్ట్రెస్, సరైన వ్యాయామం లేకపోవడం ఇతర సమస్యలు కారణం.. కనుక హాయిగా నెయ్యి తినండి ఆయుష్షు పెంచుకోండి..

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి