ఆలూరుకృష్ణప్రసాదు .
పూర్ణం బూరెలు .
శుభ సందర్భాలలో తప్పని సరిగా ప్రతి ఒక్క కుటుంబాలలో చేసుకునే పిండి వంట పూర్ణం బూరెలు .
గోదావరి జిల్లాలలో చాలామంది పెసర పూర్ణం బూరెలు చేసుకుంటారు .
మరి మనం ఈరోజు పచ్చిశనగపప్పు తో పూర్ణం బూరెలు తయారీ విధానము గురించి తెలుసుకుందాం.
చాలా మంది పూర్ణం బూరెలు చేయాలంటే మాకు భయం. మేం చేసిన ప్రతిసారీ బూరెలు నూనెలో వేయగానే చీదతాయి . ( విడిపోతాయి ) అందుకే ప్రయత్నించం అంటారు .
మేం ఎప్పుడు చేసినా బూరెలు మాకు ఎప్పుడూ అలా చీదవు .
కారణం లోపల ఉంచే పూర్ణం తయారీ గట్టిగా ఉండాలి .
పలచగా ఉండకూడదు.
పూర్ణం పిండి పలచగా తయారు చేసుకుంటే పూర్ణం బూరెలు నూనెలో వేయగానే చీదతాయి .
కాబట్టి లోపల పెట్టుకునే పూర్ణం గట్టిగా తయారు చేసుకోవాలి .
అలాగే పైన పెట్టుకునే తోపు.
తోపు అంటే తయారు చేసుకున్న పూర్ణం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని , తోపు పిండిలో ముంచి వేసుకునేది .
తోపు బాగా లేకపోతే బూరె నూనెలో వేగాక తింటే మందంగా ఉండి సాగుతుంది .
తోపు వేగాక పల్చగా ఉండాలి . తింటుంటే కరకర లాడాలి .
ఈ తోపు రెండు రకములుగా తయారు చేస్తారు .
మొదటి విధానము ఒక గ్లాసు మినపగుళ్ళు మరియు నాలుగు గ్లాసుల బియ్యంతో కలిపి మెత్తగా పిండి మర పట్టించుకోవాలి .
ఇలా మర పట్టించుకున్న పిండిలో తోపుకు కావలసినంత పిండిని ఒక గిన్నెలో వేసుకుని అందులో చిటికెడు ఉప్పు మరియు చిటికెడు సోడా ఉప్పు వేసి సరిపడా నీళ్ళు పోసి కనీసం రెండు గంటల ముందు నాన బెట్టుకోవాలి .
అలా కాకుండా అర గ్లాసు మినపగుళ్ళు మరియు రెండు గ్లాసుల బియ్యము విడిగా సరిపడా నీళ్ళు పోసుకుని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి . మరుసటి రోజు నీరు వడకట్టుకొని గ్రైండర్ లో వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
పిండిని గట్టిగా వేసుకోవాలి .
బూరెలకు అవసరమైన తోపు పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని చాలా కొద్దిగా అవసరమైన నీళ్ళు , చిటికెడు సోడా ఉప్పు మరియు చిటికెడు మామూలు ఉప్పు వేసుకుని తోపు పిండిని సిద్ధం చేసుకోవాలి .
ఈ పిండి దోశెల పిండిలా ఉండాలి .
మిగిలిన పిండిని తర్వాత దోశెలకు వాడుకోవచ్చును .
ఇంక పూర్ణం ఎలా తయారు చేసుకోవాలి ?
ఒక గ్లాసు పచ్చి శనగపప్పు సరిపడా నీళ్ళు పోసి కుక్కర్ లో మెత్తగా ఉడకబెట్టుకోవాలి .
లేదా గిన్నెలో అయినా ఉడక పెట్టు కోవచ్చును .
తర్వాత పూర్తిగా నీళ్ళు లేకుండా వడకట్టుకోవాలి .
ఆ తర్వాత ఉడికిన శనగపప్పు మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఆ తర్వాత గ్లాసు బెల్లపు పొడి ( తరిగిన బెల్లం ) ఒక గిన్నెలో వేసుకుని చాలా కొంచెము నీరు పోసుకుని స్టౌ మీద పెట్టుకుని బాగా గరిటతో తిప్పుకోవాలి .
బెల్లం పూర్తిగా కరగగానే మిక్సీ వేసుకొని సిద్ధంగా ఉంచుకున్న శనగపప్పు వేసుకుని అడుగంటకుండా బాగా దగ్గర పడి పూర్ణం గట్టిగా అయ్యే వరకు గరిటతో తిప్పు కోవాలి .
చేతితో గట్టిగా ఉండ అవుతుందో లేదో చూసుకోవాలి .
ఆ తర్వాత దింపుకుని ముప్పావు స్పూను యాలకుల పొడి వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు చేయి పట్టే వేడి చూసుకుని పూర్ణం అంతా చిన్న లడ్డూల మాదిరిగా ఉండలుగా కట్టుకొని వేరే ప్లేటులో సిద్ధంగా ఉంచుకోవాలి .
మనం పూర్ణం మరియు దానిపై తోపు రెండు సిద్దం చేసుకున్నాము .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి పూర్ణం మునిగే వరకు అంటే షుమారు ముప్పావు కిలో నూనె పోసి నూనెను బాగా కాగనివ్వాలి.
తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్న పూర్ణాలను తోపు పిండిలో ముంచి అయిదారు చొప్పున బూరెలు నూనెలో వేసుకుని , గరిటె తో తిప్పుతూ మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి .
అలా మొత్తం పూర్ణం బూరెలు వేయించుకోవాలి .
చేయడం కొంచెం శ్రమ అన్పించినా ఈ పూర్ణం బూరెల రుచి అమోఘం.
ఈ పూర్ణం బూరెలకు వేలితో కన్నం చేసుకుని దాని నిండా వెన్న కాచిన నెయ్యి వేసుకుని , ఒక్కొక్క బూరె నోట్లో వేసుకుని తింటుంటే -----
ఆహా ! ఏమి రుచి .
మరి ఇప్పుడంటే కాటరింగ్ లు , కర్రీ పాయింట్ లు , Sweet షాపులు వీధి వీధికి వెలిసాయి కాని మరి ప్రతి పండగలకు మరియు ప్రతి శుభకార్యాలకు మన బామ్మ , అమ్మమ్మ , అమ్మ , అత్తగారు మరో మనిషి సాయం లేకుండా 25 మందికి పైగా ఒంటి చేత్తో కట్టెల పొయ్యి , కుంపట్ల మీద కేవలం మూడు నాలుగు గంటల్లో రెండు కూరలు , రెండు పచ్చళ్ళు , పప్పు , పులుసు , గారెలు , పాయసం , పులిహోర మరియు ఈ పూర్ణం బూరెలు అవలీలగా చేసేవారు .
మరి వారి ఋణం ఎన్ని జన్మలెత్తి మనం తీర్చుకోగలం.
మరి వాళ్ళు 30 , 40 సంవత్సరాల క్రితం చేసిన రుచి కూడా ఈనాటికీ మన నాలిక మీద నాట్యం చేస్తోందంటే ముఖ్య కారణం వారి Dedicaton and Effection .
మరి ఈ రోజుల్లో వంట చేయడానికి ఇన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నా కొంచెం శ్రమ కూడా పడలేక పోతున్నామంటే కారణం అందుబాటులో అన్నీ రెడీమేడ్ గా దొరకడమే .
మరి ఈనాటి బజారు వస్తువుల రుచి ఎలా ఉంటుంది ?
ఎన్ని రోజులు గుర్తుంటుంది ?
ఏది ఏమైనా మనం స్వయంగా తయారు చేసుకున్న రుచి , తృప్తి బజారు వస్తువులకు ఉంటుందా ?
0 comments:
Post a Comment