Monday, July 17, 2017

తోటకూర ఆవపులుసు

తోటకూర   ఆవ  పెట్టిన  పులుసు కూర.
ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ  విధానము .
ముందుగా ఒక కట్ట తోటకూర ను  శుభ్రం గా  కడిగి   అడుగు  వేర్లు  మరియు ముదురు కాడలు  తీసేసి  లేత కాడలు  ఉంచి  సన్నగా  తరుగుకోవాలి .

ఆ తర్వాత  పావు కప్పు  చాయపెసరపప్పు ,  మరియు  తరిగిన  తోటకూర   ఒక  గిన్నెలో  అర గ్లాసు నీళ్ళు   పోసి  , స్టౌ  మీద  పెట్టి  పెసర పప్పు  మూడు వంతులు  ఉడికే  వరకు  ఉంచి  దింపేయాలి .
దానిని  వడకట్టుకుని  ఆ నీళ్ళు  పారబోయకుండా  వేరే  ఉంచి  ముద్ద  విడిగా  వేరే   ప్లేటు లోకి  తిసుకోవాలి .
నిమ్మకాయంత  చింతపండు  అరగ్లాసు నీళ్ళలో  పది నిముషాలు  నానబెట్టి  పల్చగా  రసం  తీసుకొని   ఉంచుకోవాలి
ఇప్పుడు  ఆవ  పెట్టుకోవడానికి  సిద్ధం  చేసుకోవాలి .
మిక్సీ లో  అర స్పూను  ఆవాలు , మూడు  పచ్చిమిర్చి , ఎండుమిరపకాయలు  రెండు , కొద్దిగా  ఉప్పు  మరియు  కొద్దిగా  పసుపు వేసి  కొంచెం   నీళ్ళు  పోసి  మెత్తగా   వేసుకొని  ,   వేరే  ప్లేటులో  సిద్ధంగా   ఉంచుకున్న   చల్లారిన  ముద్దను  వేసి  మిక్సీ   ఒకసారి  తిప్పాలి 
.
తోటకూర    పెసర పప్పు ముద్ద మరియు  ఆవ   అన్నీ  బాగా  కలిసి పోతాయి .

ఇప్పుడు  మరలా  ఆ ముద్దను గిన్నెలో కి  తీసుకొని  , వేరేగా ఉంచిన  ఉడికిన  నీళ్ళు, సిద్ధంగా  ఉంచుకున్న    అర గ్లాసు  చింతపండు  రసం , అర స్పూను  కారం ,సరిపడా  ఉప్పు వేసి   మళ్ళీ  స్టౌ మీద  పెట్టి  మరగ నివ్వాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   వరుసగా మూడు    ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసినవి , స్పూను మినపప్పు  , అర స్పూను ఆవాలు , పావు స్పూను జీలకర్ర  , కొద్దిగా  ఇంగువ , మూడు పచ్చిమిర్చి  ముక్కలుగా తరిగినవి  , రెండు  రెమ్మలు కరివేపాకు  వేసి  పోపు వేగగానే  సన్నగా  తరిగిన రెండు   ఉల్లిపాయల   ముక్కలు  కూడా  వేసి  ఉల్లిపాయలు  వేగగానే   ఈ  మొత్తము   పోపు  మరుగుతున్న  పులుసులో  వేసి  మరో  అయిదు  నిముషాల  పాటు  ఉంచి  ఉల్లిపాయ ముక్కలు  మెత్తగా  ఉడకగానే  దింపుకోవాలి.
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  తోటకూర   ఆవ పెట్టిన  కూర  సర్వింగ్  కు  సిద్ధం .
కొద్దిగా   తయారీ విధానము   పెద్దదిగా   ఉన్నట్లు  అన్పించినా  ఈ  తోటకూర  పులుసు కూర  చాలా  రుచిగా  ఉంటుంది .
ఈ  పులుసు కూర  అన్నం లోకే  కాకుండా  పూరీ  మరియు  చపాతీలలోకి  కూడా  చాలా  బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి