Monday, July 9, 2018

బంగాళదుంప నిమ్మరసం కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

బంగాళాదుంప  అల్లం పచ్చి మిర్చి తో ముద్ద కూర . ( నిమ్మ రసం పిండి  )
****************************

పెళ్ళిళ్ళలో చేసే కూర.

ఈ రోజు   మిత్రులందరికీ బంగాళా దుంపలు  అల్లం పచ్చి మిర్చి  వేసి  చివరలో  నిమ్మరసం  పిండిన  ముద్ద కూర.

దాదాపుగా  చాలా మంది ఇళ్ళల్లో  చేసుకునే ముద్ద కూర ఇది.

ఏ విధంగా  చేయాలో  రెసిపి  పెడుతున్నాను .

కావలసినవి .

బంగాళాదుంపలు  --  అరకిలో
పచ్చిమిరపకాయలు  --  8
అల్లం  --  రెండు అంగుళాల -- ముక్క
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  ఒక కట్ట
పసుపు  --  కొద్దిగా
నిమ్మకాయ --   బాగా రసం ఉన్న పెద్ద కాయ ఒకటి
ఉప్పు  --  తగినంత

పోపునకు .

నూనె  --  అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  5
పచ్చి శనగపప్పు  --  రెండు స్పూన్లు
మినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ విధానము .

బంగాళాదుంపలు  కడిగి  పెద్ద  ముక్కలుగా కట్ చేసుకుని  కుక్కర్ లో పెట్టుకుని  మూడు విజిల్స్ వచ్చాక దింపుకోవాలి .

చల్లారగానే  పై   చెక్కు వలచి  ఉడికిన ముక్కలను  విడిగా పళ్ళెంలో పెట్టుకోవాలి .  ముక్కల పై కొద్దిగా  పసుపు వేసుకోవాలి .

పచ్చిమిర్చి  చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .

అల్లం పై చెక్కు తీసి చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి .

నిమ్మకాయ మధ్యలోకి కట్ చేసుకుని  రసం వేరే చిన్న Bowl లోకి  పిండుకుని  రసం లోని గింజలను  తీసేసుకోవాలి .

కొత్తిమీర  శుభ్రం చేసుకుని  కట్  చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె వేసి నూనె ను  బాగా కాగనిచ్చి  వరుసగా  ఎండుమిరపకాయల ముక్కలు , పచ్చి శనగపప్పు ,
మినపప్పు , జీలకర్ర , ఆవాలు ,  ఇంగువ , అల్లం  ముక్కలు , పచ్చిమిర్చి  ముక్కలు మరియు కరివేపాకు  వేసి  పోపును  బాగా వేగ నివ్వాలి.

పచ్చి మిరపకాయ  ముక్కలు కూడా పోపులో మగ్గితే  కూరకి కారం పడుతుంది .

తర్వాత  ఉడికిన  బంగాళాదుంప  ముక్కలు  పోపులో వేసి అందులోసరిపడా  ఉప్పు  వేసి  ఒక  అయిదు నిముషాలు  మూత పెట్టి  మగ్గనిచ్చి  తర్వాత తరిగిన  కొత్తిమీర  వేసుకుని  దింపుకుని  నిమ్మరసం  అందులో వేసి  బాగా కలుపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

వేడి మీద  నిమ్మరసం  పిండితే  కూర చేదు వస్తుంది.

ఈ ముద్దకూర లో  విడిగా  మేము కారం వేయము .  అల్లం పచ్చి మిర్చి తోనే కూర రుచిగా  ఉంటుంది .

పోపులోని  ఎండుమిర్చి , పచ్చిమిర్చి , అల్లం  ముక్కల కారం సరి పోతుంది .

అంతే  పుల్ల పుల్లగా నిమ్మ , అల్లం  పచ్చి మిర్చి  రుచితో ఎంతో రుచిగా  ఉండే  బంగాళాదుంప  ముద్ద కూర  దోశెలు , చపాతీలు మరియు  భోజనము  లోకి  సర్వింగ్  కు సిద్ధం .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి