Thursday, June 1, 2017

కంద బచ్చలి కూర .

కంద బచ్చలి కూర .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ముందుగా దాదాపుగా ప్రతి వివాహం లోనూ కంద బచ్చలి కూర చేస్తారు . ఎందుకని ?
సమాధానం నాకు మా అమ్మమ్మ చెప్పింది .
మీకు కూడా చెప్తున్నాను .
ఏ రెండు కూరలు కలిపి చేసినా కంద బచ్చలికూర లాగా ఒక దానిలో ఒకటి కలిసిపోవుట.
నూతన వధూవరులు కూడ కంద బచ్చలి కూర లాగా ఒక్కటిగా విడదీయలేనంతగా ఒకరికొకరు కలిసి పోవాలని ప్రతి వివాహం లోను కంద బచ్చలికూర చేస్తారుట.
ఇంక విషయానికి వస్తే
కంద బచ్చలి కూర తయారు చేయు విధానము .
మన ముందు తరం వాళ్ళు అంటే మన అమ్మమ్మలు అమ్మా వాళ్ళు, అందరూ పాత కాలం నుండి చేసుకునే కూర ఈ కంద బచ్చలి కూర .
ఇలాంటి దుంపలలో కంద ఒకటి ..
కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకో అనే సామెత ఉంది
నిజమే కంద ముట్టుకుంటే చేతులు దురదలు పెట్టేస్తాయి
. కందని బచ్చలి కలిపి కాస్త ఆవ పెట్టి కూర చేసామా.. ఆ రుచి ఇక చెప్పక్కర్లేదు .....
. ఆస్వాదించాల్సిందే. కాస్త చింతపండు గుజ్జు, ఆవ, అంత ఇంగువ వేసామంటే ఇలాంటి కూరలు మర్నాటికి మరింత రుచి తెల్తాయి. మరి ఆ కూర చేసుకుందామా ఈరోజు.

****
కావలసినవి:-
తెల్ల కంద - పావు కిలో
బచ్చలి - రెండు కట్టలు
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం - చిన్నముక్క
కొత్తిమిర - ఒక కట్ట
కరివేపాకు - ఒక రెబ్బ
ఆవపొడి - అరస్పూను
కారం -పావుస్పూను
ఉప్పు - తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఇంగువ - పావు స్పూను
చింతపండు గుజ్జు - ఒక స్పూను
ఆవాలు +మినప్పప్పు+జీలకర్ర+సెనగపప్పు+జీడిపప్పు+ఎండుమిర్చి+ఇంగువ+కరివేపాకు+పసుపు ఇవి పోపు సామాన్లు.
చేయు విధము: ----
కంద తొక్క తీసి,నీళ్ళలో ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి.
పై చెక్కు తీసి పులుసు ముక్కలు మాదిరిగా తరుగు కోవాలి.
బచ్చలి కడిగి సన్నగా తరగి రెండూ కలిపి తగినన్ని నీరు పోసి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చు
వరకు ఉడికించాలి.

అల్లం కొత్తిమిర,పచ్చిమిర్చి మెత్తగా రోట్లో లేదా మిక్సర్ లో గ్రైండ్ చేసుకోవాలి.
ఆవపొడిలో,కారం,కొద్దిగా నూనె,నీరు కలిపి ఒకపక్కన ఉంచాలి.
బాండీ లో నూనె వేసి కాగాక పైనచెప్పిన పోపు సామాను ఒకటొకటిగావేసి, వేయించి,అందులో అల్లం వగైరా పేస్ట్ వేసి,ఉడికించి ఉంచుకున్న కందబచ్చలి ఒకసారి మెదిపి పోపులో వేయాలి.
ఉప్పు వేసి బాగా కలిపి చింతపండు గుజ్జు వేసి కలిపి ఒక ఐదు ని"లు మగ్గనిచ్చి, దించేముందు కలిపి ఉంచుకున్న ఆవ అందులో వేసి బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి.
ఆవ స్టౌ ఆపేముందు పెట్టుకోండి .
లేకపోతే కూర చేదు వస్తుంది .
ఆవ ఘుమ,ఘుమలతో కంద బచ్చలి కూర రెడీ!
ఈ కూర వేడీ వేడీ అన్నంలోకి బాగుంటుంది, మర్నాటికి రుచి మరింత బాగుంటుంది.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి