నిమ్మకాయ రసము తో రవ్వ పులిహోర.
కావలసినవి .
బియ్యపు రవ్వ -- ఒక గ్లాసు
నిమ్మకాయలు -- మూడు
పసుపు -- అరస్పూను
ఉప్పు --- తగినంత
కరివేపాకు --- నాలుగు రెమ్మలు
పచ్చిమిరపకాయలు -- 6
వేరు శనగ గుళ్ళు --- పావు కప్పు
నూనె --- 100 గ్రాములు
పోపు సామగ్రి .
ఎండుమిరపకాయలు --- 6
పచ్చి శనగపప్పు --- మూడు స్పూన్లు .
చాయమినపప్పు -- రెండు స్పూన్లు
ఆవాలు --- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఇంగువ -- మరి కాస్త
జీడిపప్పు - 15 పలుకులు
తయారీ విధానము .
ముందుగా మూడు నిమ్మ కాయలు కట్ చేసుకుని చేదు దిగకుండా రసం తీసుకుని వేరే కప్పు లో ఉంచుకోవాలి .
పచ్చిమిరపకాయలు నిలువుగా చీలికలు గా కట్ చేసుకోవాలి .
స్టౌ వెలిగించి ఒక గిన్నెలో రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకుని బాగా తెర్ల నివ్వాలి .
నీళ్ళు మరుగు తున్నప్పుడు ఒక స్పూను నూనె వేసి కొంచెం ఉప్పు వేసి గ్లాసు బియ్యము రవ్వ వేసి బాగా ఉడక నివ్వాలి .
ఆ విధంగా ఉడికిన రవ్వను ఒక బేసిన్ లోకి వంపుకుని , నాలుగు స్పూన్లు నూనె , కొంచెం పసుపు , కరివేపాకు వేసి గరిటతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ స్టౌ వెలిగించి బాండి పెట్టి మిగిలిన నూనె వేసి వరుసగా ఎండుమిరపకాయలు ( తుంపకుండా ) , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు ,
వేరుశనగ గుళ్ళు , ఆవాలు ,పచ్చి మిర్చి ,
కరివేపాకు , జీడిపప్పు , ఇంగువ వేసి పోపు బాగా వేగ నివ్వాలి .
పోపు వేగిన వెంటనే , ముందుగా సిద్ధం గా చేసుకున్న నిమ్మ రసం , పోపు కూడా వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అవసరమయితే కలుపుకోవాలి .
అంతే ఘుమ ఘుమ లాడే నిమ్మ కాయలతో రవ్వ పులిహోర సర్వింగ్ కు సిద్ధం .
ఈ రవ్వ పులిహోర రెండు రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి దూర ప్రయాణము లకు వెళ్ళే వారు నిక్షేపంగా తయారు చేసుకుని తీసుకు వెళ్ళవచ్చును.
నిన్న మా ఇంటికి వచ్చిన మా అక్క గారు గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టౌ ఆపింది .
మామూలుగా గిన్నెలో వండిన విధంగా పొడి పొడిగా ఉడికి బాగుంది.
కావున కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చును