Saturday, April 14, 2018

పొట్టు  మినపప్పు  తో  రోటిపచ్చడి

పొట్టు  మినపప్పు  తో  రోటిపచ్చడి.

ఇటీవల కాలంలో  మినపగుళ్ళు  మరియు  చాయమినపప్పు  వచ్చాయి కాని  పాత కాలంలో  వంటల లోకి  పోపులలోకి పొట్టు మినపప్పు నే వాడే వారు .

గారెలు  వేయడానికి  కూడా  పొట్టు మినపప్పునే  ఉపయోగించేవారు .

మినపసున్ని ఉండలు  తయారు చేయడానికి  కూడా  ఈ  పొట్టు మినపప్పు నే  ఉపయోగించేవారు .

అలా  వేయించి  తిరగలిలో  విసిరిన మినపసున్ని  విసిరేటప్పుడే  ఇల్లంతా  ఘమ ఘమ లాడి పోయేది .

పొట్టు మినపప్పు  ఉపయోగించడం  వలన  శరీరానికి అవసరమైన ఐరన్ ధాతువు     సమకూరుతుంది .

ఇప్పుడు  పొట్టు మినపప్పు  తో  రోటిపచ్చడి  ఎలా చేయాలో  తెలుసుకుందాం .

కావలసినవి .

పొట్టు మినపప్పు  --  100 గ్రాములు .
ఎండుమిరపకాయలు  --  15 
జీలకర్ర  --  స్పూనున్నర
చింతపండు  --  నిమ్మకాయంత . ( విడదీసి పావు గ్లాసు నీళ్ళలో  పావు గంట ముందు తడిపి  ఉంచుకోవాలి .)
నెయ్యి  లేదా  నూనె  --  మూడు స్పూన్లు
ఇంగువ --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
బెల్లం  --  చిన్న ముక్క
(  ఇష్టం లేని వారు  మానేయవచ్చును )

తయారీ విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండి పెట్టి  మూడు స్పూన్లు  నెయ్యి  వేసి , నెయ్యి బాగా కాగగానే  పొట్టు మినపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  మరియు  ఇంగువ వేసి  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి .

చల్లారగానే  రోటిలో  ఈ మిశ్రమము , చింతపండు  నీళ్ళతో సహా , తగినంత  ఉప్పు మరియు చిన్న బెల్లం  ముక్కను వేసి  పొత్రముతో  కొద్దిగా  నీళ్ళు చిలకరిస్తూ   మరీ  మెత్తగా  కాకుండా  కొంచెం  పప్పులు తగిలే విధముగా  రుబ్బుకోవాలి .

తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

ఈ పచ్చడి  రెండు రోజులు  నిల్వ ఉంటుంది .

అంతే  ఎంతో  రుచిగా  ఉండి ఆరోగ్యకరమైన  పొట్టు మినపప్పుతో  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం.

రోటి సౌకర్యము  లేని వారు ఇదే  పద్ధతిలో  మిక్సీ లో  చేసుకొనవచ్చును .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి