Thursday, August 31, 2017

నేతిబీరకాయ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ఈ రోజు  స్పెషల్ .

నేతి బీరకాయ పచ్చడి .

కార్తీక మాసంలో  నేతి బీరకాయ  తప్పక తినాలని  ఎప్పటి నుండో  పెద్దలు   చెప్పారు .

కారణం కార్తీక మాసం  చలి ప్రభావం  బాగా ఉంటుంది .

సహజంగానే  ఆ ప్రభావం  జీర్ణ వ్యవస్ధపై  ఉంటుంది .

నేతి బీరకాయ లో పీచు  పదార్ధం  ఎక్కువగా  ఉంటుంది .

మనం  తీసుకున్న  ఆహారం  పూర్తిగా  జీర్ణం  అవటానికి  ఈ నేతి బీరకాయ తో చేసిన  వంటకాలను ముఖ్యంగా  ఆసమయంలో  వాడమంటారు .

నేతి  బీరకాయతో  కూర చేసుకుంటారు కొంతమంది .

చాలా మంది  నేతి బీరకాయ తో పచ్చడి  చేసుకుంటారు .

నేను  ఇప్పుడు  మీకు  నేతి బీరకాయతో  పచ్చడి  ఎలా చేసుకోవాలో  తెలియ చేస్తాను.

కొంతమంది   ఈ  పచ్చడిలో  పచ్చి టమోటో లు  కూడా కలిపి చేసుకుంటారు.

అలా కూడా పచ్చడి రుచిగానే ఉంటుంది.

ఒకరు  నేతి బీరకాయ  పచ్చడి  చేసాక  పచ్చడిలో  మూడు  స్పూన్లు   వేయించిన   నువ్వులపొడి  కలిపారు .

అలా కూడా  రుచిగానే  ఉంది.

నేను  మామూలుగా   చేసుకునే  నేతి  బీరకాయ  పచ్చడి  గురించి  తెలియచేస్తాను .

నేతి  బీరకాయ  పచ్చడి .

కావలసినవి.

నేతి బీరకాయలు  --  మూడు  లేదా  అర కిలో .

కాయలు ముదిరితే  పచ్చడి  పీచుగా  ఉంటుంది.  అందువల్ల లేత  నేతి బీరకాయలు  తీసుకోండి.

ఆ కాయలు  పై  చెక్కు   తీయనవసరం  లేదు .

శుభ్రంగా  కడిగి  ముక్కలుగా  తరుగుకోవాలి.

పచ్చి  మిరపకాయలు  --  8
చింతపండు  --  ఉసిరికాయంత
ఉప్పు  --  తగినంత
పసుపు  --  కొద్దిగా
కొత్తిమీర   --  ఒక చిన్న కట్ట .

పోపునకు.

నూనె  --  మూడు స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  6
మెంతులు  --  పావు  స్పూను

మినపప్పు   --  స్పూను
ఆవాలు  --  అర స్పూను
జీలకర్ర   --  పావు స్పూను
ఇంగువ --  కొద్దిగా
కరివేపాకు --  మూడు  రెమ్మలు

తయారీ  విధానము .

ముందుగా   స్టౌ మీద  బాండీ  పెట్టి  మూడుస్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ  మరియు కరివేపాకు   వేసి  పోపు  వేయించుకుని  వేరే  ప్లేటులోకి  తీసుకోవాలి .

తర్వాత   అదే  నూనెలో  నేతి బీరకాయ  ముక్కలు ,  పచ్చిమిరపకాయలు , కొద్దిగా  పసుపు  వేసి  మూత పెట్టి  ముక్కలను  బాగా  మగ్గనివ్వాలి .

ముక్కలు  బాండీలో  వేయగానే  ముక్కల లోని  నీరు  బయటకు  వస్తుంది .

ఆ  నీరు  కూడా  బాగా  ఇగర  నిచ్చి  మగ్గిన  ముక్కలను  వేరే ప్లేటు  లోకి  తీసుకోవాలి.

ఇప్పుడు   ముందుగా  మిక్సీ లో  వేగిన ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు వేసి  మెత్తగా   వేసుకోవాలి .

తర్వాత  చింతపండు  కూడా విడదీసి  మిక్సీ లో  మెత్తగా వేసుకోవాలి .
.

ఇప్పుడు  మగ్గిన నేతి బీరకాయ  ముక్కలు  మరియు  పచ్చిమిరపకాయలు  వేసి  మిక్సీ లో  మెత్తగా   వేసుకోవాలి .

చివరగా  మిగిలిన  పోపు  మరియు కొత్తిమీర  కూడా    పచ్చడి లో వేసి  ఒకసారి  మిక్సీ   వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

కావలసినవారు  మినపప్పు , ఆవాలు  వేసి  మరోసారి  పైన పోపు  పెట్టుకోండి.

అంతే .

ఎంతో  రుచిగా  ఉండే  నేతి బీరకాయ పచ్చడి  దోశెలలోకి, రోటీలలోకి  మరియు  అన్నం  లోకి  సర్వింగ్  కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి