Thursday, August 31, 2017

మైసూర్ మసాలా దోశే

ఆలూరుకృష్ణప్రసాదు .

మైసూర్ మసాలా దోశె.

కావలసినవి .

మినపప్పు   --  అరకప్పు
బియ్యము  ---  రెండు కప్పులు
అటుకులు  -- పావుకప్పు
మెంతులు  ---  అరస్పూను
ఉప్పు  --  కొద్దిగా
నూనె  --  100 గ్రాములు.

తయారీ  విధానము .

బియ్యము  , మినపప్పు , మెంతులు  సరిపడా  నీళ్ళు  పోసి ఆరు  గంటల సేపు  నానబెట్టు కోవాలి.

అటుకులు  పై  మూడింటిని  గ్రైండ్  చేయబోయే  పది నిముషాలు   ముందు నాన బెట్టు కోవాలి .

ఇప్పుడు  నానబెట్టిన బియ్యము , మినపప్పు ,  మెంతులు  మిశ్రమము , మరియు  నానబెట్టిన అటుకులు కూడా  కలిపి గ్రైండర్ లో కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి .

ఈ పిండిలో  దోశెలు  వేసుకునే ముందు కొద్దిగా  నీళ్ళు మరియు కొద్దిగా  ఉప్పు  వేసి  దోశెలు  వేసుకునే  విధముగా  సిద్ధం చేసుకోవాలి.

మసాల దోశె  కూర తయారు  చేసుకునే విధానము.

కావలసినవి.

బంగాళాదుంపలు  --  మూడు
ఉల్లిపాయలు   --  రెండు
పచ్చిమిర్చి  --  5
కొత్తిమీర   --  తరిగినది  అర కట్ట .
ఉప్పు  ---  తగినంత
కరివేపాకు --  రెండు  రెమ్మలు

పోపునకు.

ఎండుమిర్చి  --  3  ముక్కలుగా  చేసుకోవాలి.
మినపప్పు  --  స్పూను
ఆవాలు  --  అర స్పూను

తయారీ  విధానము .

ముందుగా  బంగాళాదుంపలు   నాలుగు  ముక్కలుగా  తరుగుకుని  కుక్కర్  లో  మూడు  విజిల్స్  వచ్చే వరకు ఉంచి  చల్లారగానే  బంగాళాదుంపల  పై  చెక్కు  తీసుకుని  మెత్తగా  చేసుకుని  విడిగా వేరే ప్లేటులో  ఉంచుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు  మరియు కరివేపాకు  వేసి  పోపు  వేగగానే  ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  పచ్చిమిర్చి   ముక్కలు  వేసి   మూతపెట్టి   బాగా  మగ్గనివ్వాలి .

తర్వాత  ఉడికిన బంగాళాదుంపలు , కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు వేసి బాగా  మగ్గనిచ్చి  కొత్తిమీర  కూడా వేసుకుని  దింపుకోవాలి.

దోశెలపై  వేసుకునే  పొడి .

పది ఎండుమిరపకాయలు , ఇష్టమైన  వారు అయిదు వెల్లుల్లి  రెబ్బలు నూనెలో  వేయించుకుని  కొద్దిగా  పసుపు మరియు కొద్దిగా  ఉప్పు వేసుకుని  మిక్సీ లో  పొడిగా   చేసుకోవాలి ,

ఈ పొడి  ఒక  కప్పులో  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ వెలిగించి  పెనం పెట్టి   పెనం పైన  నూనె  రాసి  పెనం బాగా వేడెక్కగానే  దోశె వేసి  దోశె   పైన అంతా కొద్దిగా  వెన్న రాసి , కారం పొడి  కూడా రాసి ,  రెండు  స్పూన్లు  కూర  పెట్టుకుని   దోశె  పైన  కొద్దిగా   నూనె  వేసి   బాగా కాల నివ్వాలి.

ఇదే  పద్ధతిలో  మిగిలిన   దోశెలను  కూడా  వేసుకోవాలి .

ఈ  మైసూర్  మసాలా  దోశెలు   వేడి  వేడిగా  కొబ్బరి చట్నీ  మరియు  అల్లం   చట్నీతో  సర్వ్  చేసుకోవాలి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి