Thursday, August 31, 2017

సాంబారు కారం

సాంబారు  కారం  తయారీ  విధానము .

ముందుగా  సాంబారు  కారం  అంటే  సాంబారు  లోకి  వాడే  కారం  కాదు .

దయచేసి  గమనించ గలరు .

అసలు  పూర్తిగా   అంటే  నూటికి   నూరుపాళ్ళు  వెల్లుల్లి   ఇష్ట పడని  వారు  దయచేసి  ఈ  సాంబారు కారం  తయారీకి   ప్రయత్నించ వద్దు .

మన  ఇళ్ళల్లో  ప్రతి రోజు  వంటల్లో  కారం  అంటే  కొట్టి  ఉంచుకున్న  జీలకర్ర   కారం  వాడతాము .

ఈ  జీలకర్ర  కారం  అన్ని  వంటలలో  కూడా  అంటే  ముద్ద కూరలు  , వేపుడు కూరలు , కారం  కూరి  చేసే  బెండకాయ , కాకరకాయ  వంటి  కూరల్లోను  వాడతాము .

అలాగే  చాలా  మంది  అంటే  జీలకర్ర  కారం  వాడని వారు   సాంబారు  కారం   ప్రతి  వంటల్లోను  నూటికి  నూరు పాళ్ళు  వాడతారు .

వాళ్ళు  ఏడాదికి   సరిపడా  చాలా  ఎక్కువ   మోతాదులో   అంటే  షుమారు  అయిదారు  కిలోల  మోతాదులో  రోకళ్ళ  మరల్లో  దంపించుకుని  శుభ్రంగా  వాసన  పోకుండా  ఉండటానికి   ఒక  జాడీలో  పోసుకుని  ,  కావలసినప్పుడు   కొద్ది  కొద్దిగా  వేరే  కంటైనర్  ల లోకి  తీసుకుని  పూర్తిగా  సంవత్సరం   పొడుగునా  వాడుకుంటారు .

ముఖ్యంగా  వారి  కోసమే  ఈ  సాంబారు  కారం  తయారీ విధానము .

ఇక్కడ   నేను  ఒక  K.G .  ఎండు మిరపకాయలకు  సరిపడా  మిగిలిన  దినుసుల  కొలతలు  ఇచ్చాను .

మీరు  రెండు  లేదా  మూడు  K.G. ల   ఎండుమిరపకాయలతో  సాంబారు  కారం  కొట్టించు కోదల్చుకుంటే  దాని  ప్రకారం  మిగిలిన  దినుసుల  కొలతలు  పెంచుకోవాలి.

ఇక  ఈ  సాంబారు  కారం  తయారీ  విధానము   గురించి  తెలుసుకుందాం.

కావలసినవి .

ఎండు  మిరపకాయలు   --  1  K.G. .
ధనియాలు   ---   పావు  K.G .
జీలకర్ర    ---   100  గ్రాములు .
మెంతులు  ---   50  గ్రాములు .
పొట్టు మినపప్పు   లేదా  చాయ మినపప్పు   ---    50  గ్రాములు .
పచ్చి  శనగపప్పు  ---  50  గ్రాములు .
రాళ్ళ ఉప్పు   ---  అర కిలో  500  గ్రాములు .
కరివేపాకు   ఆకులు   పొడిగా   ఒక  కప్పు  నిండా  తీసుకోవాలి.
వెల్లుల్లి   ---   పావు  కిలో  .
నేను  ఫోటోలో  చూపిన  విధముగా  పై  పొట్టు  తీయకుండా  విడివిడిగా  పాయలుగా  తీసుకోవాలి .
కల్తీ  లేని  మంచి  పసుపు  ---  నాలుగు స్పూన్లు .
స్వచ్ఛమైన   ఆముదం  --  50  గ్రాములు .

ఆముదం  ఇష్టం  లేని  వారు  బదులుగా స్వచ్ఛమైన   నువ్వుల నూనె  వాడుకోండి.

తయారీ  విధానము .

ముందుగా   ఎండు మిరపకాయలు
తొడిమలు  తీసి  రెండు  రోజులు  బాగా  గల  గల  లాడే విధముగా  ఎర్రని   ఎండలో  పెట్టుకోవాలి .

నూనె  వెయ్యకుండా   ఒట్టి  బాండిలో  విడివిడిగా   ధనియాలు ,   జీలకర్ర ,  మెంతులు , మినపప్పు , శనగపప్పు  , రాళ్ళ  ఉప్పు  మరియు  కరివేపాకు   వేయించుకోవాలి .

అన్నీ  విడివిడిగా   వేరే  ప్లేట్ల లోకి  తీసుకోవాలి.

చల్లారాక

పైన  చెప్పిన   వన్నీ  విడివిడిగా   మిక్సీ  వేసుకుని  పసుపు  కలిపి అన్నీ  ఒక బేసిన్  లోకి  తీసుకోవాలి  .

వేగిన  కరివేపాకు   కూడా  మిక్సీ  వేసుకుని   పొడిగా  చేసుకుని  అన్నింటితో  పాటు  కలుపుకోవాలి .

బాగా  ఎండిన  ఎండు మిరపకాయలు  మిక్సీలో  మెత్తగా  వేసుకోవాలి .

లేదా  మర  పట్టించుకోవాలి .

ఇప్పుడు  బేసిన్  లో  ఉన్న  దినుసులు  పొడి  మరియు  ఎండు
మిరప కాయల  కారం  అన్నీ  బాగా  చేత్తో  బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు   చివరగా  మళ్ళీ  మిక్సీలో  ఒక  కప్పుడు  ఈ  కలిపిన  పొడి , ఆముదం   మరియు  వెల్లుల్లి  పాయలు  వేసి  ఒక్కసారి  మిక్సీ  తిప్పి  ఆ  మిశ్రమాన్ని   ఈ  బేసిన్  లోని  కారం తో  కలిపి  మొత్తము   సాంబారు  కారాన్ని  చేతులతో  బాగా  గుచ్చెత్తుకుని  బాగా  కలుపు కోవాలి .

వెల్లుల్లి   మరీ  పేస్టులా  నలగకూడదు .

నోట్లో  వేసుకుని   చూసుకుంటే  ఉప్పు  నోటికి  తగలాలి.

అప్పుడు  కూరల్లోకి  సరిపోతుంది .

అంతే  ఏటికి  ఏడాది  నిల్వ  ఉండి ఘుమ  ఘమ  లాడే  వెల్లుల్లి   వాసనలతో  "  సాంబారు  కారం  "
సిద్ధం .

ఈ  సాంబారు  కారాన్ని  ఒక  జాడీలో  కాని , ఒక  కంటైనర్ లో  కాని  పోసుకుంటే  ఏడాది  పొడవునా  ఆ  వాసన   అలాగే  ఉంటుంది .

మా  వరకు .

ఏ  కూరల్లో  వాడము .
ఇడ్లీ  , దోశెలు  మరియు  కాకర కాయ  కాయల  పళంగా  చేసుకునే  వాటిలో  వాడతాము.

వెల్లుల్లి   పూర్తిగా   అంటే  నూటికి నూరు పాళ్ళు  మాకు  నిషేధము  కాదు .

చాలా చాలా  తక్కువగా   వాడతాము .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి