Thursday, August 31, 2017

అరటికాయ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ప్రియమిత్రులందరికీ

ఈ  రోజు  స్పెషల్  అరటి కాయ పచ్చడి .

అరటి  కాయ  తో  పచ్చడా  !

అని  ఆశ్చర్య  పోకండి.

ఒకసారి  చేసి  చూడండి .

అరటి కాయ పచ్చడి  తయారు  చేయు  విధానము .

కాలసిన  వస్తువులు .

అరటి కాయలు         ----   2
పెద్ద ఉల్లిపాయలు           ----     2
పచ్చిమిరపకాయలు    -----  4
కరివేపాకు     -----   3   రెమ్మలు
కొత్తిమీర     -----   మరి కాస్త  ఎక్కువ .

పోపు  వేయుటకు  ---  నూనె  3  టీ  స్పూన్లు .
ఎండు  మిరపకాయలు  ---  5
చాయ మినపప్పు  ---  2  స్పూన్లు
ఆవాలు   ----  1   స్పూన్
ఇంగువ   ---  తగినంత
పసుపు   ---  కొద్దిగా 
ఉప్పు   ----  తగినంత .

అరటి కాయ  పచ్చడి  తయారు చేయు విధానము .

ముందు  ఉల్లిపాయలు  పై  పొట్టు  తీసి  చాలా  సన్నగా  చిన్న  చిన్న  ముక్కలుగా  తరగండి.

(  ఎలాగంటే  దోశెలలోకి  మరియు మిర్చి  బజ్జీలలోకి  సన్నగా  తరుగుతాము  కదా .  ఆ  విధంగా )

ఇప్పుడు  అరటికాయలు  శుభ్రంగా  కడిగి  పొడిగా  గుడ్డ పెట్టి  తుడవండి.

అరటి కాయల  చెక్కు తీయవద్దు.

ఇప్పుడు  స్టౌ  వెలిగించి  సెగ  సిమ్  లో  పెట్టండి.

అరటికాయలు మీద  నూనె రాయనక్కరలేదు .

ఆ  రెండు  అరటి కాయలు  వంకాయలు  రోటి  పచ్చడికి  కాల్చినట్లు  కాల్చండి .

పై  చెక్కు  నల్లగా  అయి  చేతితో  పట్టుకొని   చూస్తే  లోపల  మెత్తగా  అవుతుంది .

గిన్నెలో  నీళ్ళు  పెట్టుకుని  చేతులు  తడి చేసుకుంటూ  ఆ కాయల  పై చెక్కు తీసేయండి .

ప్లేటులో  ఆ కాయలు  ఉంచుకోండి.

ఇప్పుడు  స్టౌ  మళ్ళీ  వెలిగించి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  అందులో  చాయ మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు ,  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగాక  అందులో  కరివేపాకు , పచ్చిమిరపకాయలు   వేసి  రెండు  నిముషాలు  ఉంచి  స్టౌ  ఆపేయండి .

సన్నగా   తరిగిన  ఉల్లిపాయ ముక్కలు  వేయించవద్దు .

పోపు  చల్లారాక  ముందుగా  మిక్సీ లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు , పసుపు కొద్దిగా వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

మిగిలిన  పోపు  ఇప్పుడే  వేయవద్దు.

తర్వాత మిక్సీ లో  కాలిన  అరటి కాయలు  ,పచ్చి మిరపకాయలు ,
వేగిన  కరివేపాకు   వేసి  మరోసారి  మిక్సీ  వేసుకోండి.

అరటికాయలు  బాగా  కాలి ఉంటాయి  కాబట్టి  కొద్దిగామిక్సీ వెస్తే  చాలు  పచ్చడి  మెత్త పడుతుంది .

ఇప్పుడు  ఒక  పళ్ళెంలోకి  తీసుకొని  సన్నగా  తరిగి ఉంచుకున్న  ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన  పోపు , కొత్తిమీర   సన్నగా   తరిగి  చేత్తోనే  బాగా కలుపుకుని  ఒక  Bowl  లోకి  తీసుకోండి.

అంతే  పసందైన  అరటి కాయ  పచ్చడి  భోజనం  లోకి  సిద్ధం.

ఇందులో  ఉల్లిపాయలు  పచ్చివి  వేసుకుంటేనే  చాలా రుచిగా  ఉంటుంది .

వేగిన  మినపప్పు పంటి కింద   తగులుతూ  చక్కని  రుచితో  ఉండే  ఈ  అరటి కాయ  పచ్చడి  తప్పక   try  చెయ్యండి.

మీ  అందరికీ   నచ్చుతుంది .

ఈ  పచ్చడికి  పండిన , ఓ  మాదిరిగా   పండిన  అరటి కాయలు  వాడవద్దు .

పచ్చడి  తీపి  వచ్చి  రుచి  పాడవుతుంది .

పచ్చి  కాయలే  వాడండి .

ఫోటో  ---  ఈ  రోజు  మేము  చేసిన  అరటికాయ  పచ్చడి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి