Sunday, November 12, 2017

బొంబాయి రవ్వ పొంగల్

ఆలూరుకృష్ణప్రసాదు .

సూజి రవ్వతో [ బొంబాయి రవ్వ  ]  పొంగల్.

చాలా మందికి    సాధారణంగా ఉప్మా  అల్పాహారముగా  ఇష్ట పడరు .

అటువంటి వారు  బొంబాయి  రవ్వతో  పొంగల్  చేసుకుంటే  చాలా రుచిగా ఉంటుంది .

ఈ మధ్యన కాకినాడ  మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినప్పుడు  మా అత్తయ్య  చేసి పెట్టింది .

మా అందరికీ  వెరైటీ గా చాలా బాగుందనిపించింది .

ఇందులో  ప్రక్కన నంచుకుని తినటానికి   కొబ్బరి చట్నీ  మరియు సాంబార్  రెండూ  అత్తయ్య చేసింది .

ఆ రెండింటితో  తిన్నప్పుడు  ఈ రవ్వ పొంగలి  సూపర్ గా  ఉందనిపించింది .

మరి మీరు కూడా ప్రయత్నించండి.

కావలసినవి.

బొంబాయి  రవ్వ  --   ఒక  గ్లాసు. ( షుమారు  పావు కిలో )
చాయపెసరపప్పు  --  30  గ్రాములు .
జీడిపప్పు  --  20
మిరియాలు --  ఒక స్పూనున్నర .
నెయ్యి --  50 గ్రాములు
పచ్చిమిరపకాయలు  --  12
అల్లం  --  ఒక  చిన్న ముక్క ( షుమారు 30  గ్రాములు . )
జీలకర్ర  -- స్పూనున్నర
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు.
ఉప్పు  --  తగినంత .

నీళ్ళు  ఒక గ్లాసు రవ్వకు  మూడు గ్లాసులు .

తయారీ విధానము .

ముందుగా  చాయపెసరపప్పు  ను ఒకసారి కడుగుకుని  నీళ్ళలో  ఒక  అరగంట సేపు నాన బెట్టుకోవాలి .

పచ్చి మిర్చి  చిన్న చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి.

అల్లం  పై చెక్కు తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి.

మిరియాలు  అమాన్ దస్తాలో లేదా  రోటిలో మెత్తగా  దంపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ  లేదా  మందపాటి  గిన్నె పెట్టి  మూడు స్పూన్లు  నూనె విడిగా  తీసి మిగిలిన  నెయ్యి అంతా   వేసి నెయ్యి బాగా కాగగానే  వరుసగా మిరియాల పొడి , జీలకర్ర , జీడిపప్పు ముక్కలు   వేసుకుని  వేగగానే  పచ్చి మిర్చి  ముక్కలు , అల్లం ముక్కలు మరియు కరివేపాకు  వేసుకుని  పోపు బాగా వేగ గానే మొత్తము  నీళ్ళు పోయాలి .

అందులో నాన బెట్టిన పెసర పప్పు వేసి  నీళ్ళు బాగా తెర్లి  పెసరపప్పును  కొద్దిగా  ఉడకనివ్వాలి . తర్వాత తగినంత  ఉప్పు వేసి  నీళ్ళు బాగా తెర్లుతున్నప్పుడు సన్నగా రవ్వ  పోస్తూ అట్లకాడతో ఉండ కట్టకుండా  బాగా కలుపుతూ  ఉండాలి.

తర్వాత  మూతపెట్టి  ఒక పది నిముషాలు  సన్నని  సెగన మగ్గనివ్వాలి.

దింపే ముందు  మరో మూడు స్పూన్లు  నెయ్యి  వేసి  దింపుకోవాలి .

ఈ రవ్వ పొంగల్ వేడి వేడిగా కొబ్బరి  చట్నీ సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది .

ఈ పొంగల్  నెయ్యితో  చేసుకుంటేనే  చాలా రుచిగా ఉంటుంది.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి