Monday, September 3, 2018

కరివేపాకుతో పులిహోర

ఆలూరుకృష్ణప్రసాదు .

కరివేపాకు తో పులిహోర .

కరివేపాకు  ఆరోగ్యానికి  చాలా మంచిది .

కంటి చూపు మెరుగుదలకు , అరుగుదలకు కరివేపాకు  ఏదో విధంగా ఆహారంలో వాడుకోవడం ఉత్తమం .

చాలా మంది  కూరల్లో , పులుసుల్లో  కరివేపాకు  వేసుకున్నా  భోజనము చేసే సమయంలో  కరివేపాకు  తీసి పారేస్తారు .

మనకు "  కూరల్లో కరివేపాకు లా తీసిపారేసాడురా "  అనే సామెత ఉండనే ఉంది కదా .

చాలామంది కరివేపాకు లోని సుగుణాలను  గుర్తించి  కరివేపాకు తో కారప్పొడి , కరివేపాకు  పచ్చడి  ఇలాచేసుకుంటూ ఉంటారు .

మేము  కరివేపాకుతో పులిహోర  చేసుకుంటే ఎలా ఉంటుందా అని  కొంచెం  వెరైటీ గా  ప్రయత్నించాము.

చాలా బాగా కుదిరింది.

అందువల్ల ఆ రెసిపీ మీకు తెలియచేస్తున్నాను.

కరివేపాకు తో పులిహోర .

కావలసినవి .

బియ్యం  --  షుమారు  175  గ్రాములు  లేదా  ఒక గ్లాసు .
చింతపండు  --  షుమారుగా  60 గ్రాములు .
పచ్చిమిర్చి  -- 10
పసుపు  ---  స్పూను
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు .
ఇంగువ --  పావు టీ స్పూను

పులిహోర లో వేయటానికి కరివేపాకు  పొడికి కావలసిన  పదార్ధములు .

ఎండుమిరపకాయలు  - 4
కరివేపాకు  --  ఒక కప్పున్నర
పచ్చిశనగపప్పు  -  రెండు  స్పూన్లు
చాయమినపప్పు  -  రెండు స్పూన్లు
వేరు శనగ గుళ్ళు -  రెండు స్పూన్లు 
నువ్వుపప్పు  - రెండు  స్పూన్లు
ఇంగువ  -  కొద్దిగా
ఉప్పు -  తగినంత
నూనె  --  మూడు స్పూన్లు

పులిహోర లో పోపునకు .

ఎండుమిరపకాయలు  - 8 
పచ్చిశనగపప్పు  - రెండు స్పూన్లు
చాయమినపప్పు  - రెండు స్పూన్లు
ఆవాలు --  స్పూను
ఇంగువ  --  కొద్దిగా
జీడిపప్పు  - పది బద్దలు
వేరు శనగపప్పు  -  మూడు స్పూన్లు 
కరివేపాకు  -- మూడు రెమ్మలు .

కరివేపాకు  పులిహోర  తయారీ విధానము .

ముందుగా ఒక గ్లాసు బియ్యము కడిగి , తగినన్ని  నీరు పోసి  స్టౌ మీద పెట్టుకుని  పొడి పొడిగా  వండుకోవాలి .

చింతపండు  పదిహేను నిముషాలు  గ్లాసు నీళ్ళలో నాన బెట్టుకుని  
చిక్కగా రసము తీసుకోవాలి .

ఇప్పుడు  పులిహోరలో వేయడానికి  పొడి  సిద్ధం చేసుకోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  పొడికి కావలసిన పైన తెలిపిన నూనె వేసి నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , వేరుశనగ గుళ్ళు , నువ్వుపప్పు , కొద్దిగా  ఇంగువ  మరియు  కరివేపాకును  వేసి  ఎర్రగా  పోపు వేయించుకోవాలి .

పోపు చల్లారగానే మిక్సీ లో  మెత్తగా  పొడి చేసుకోవాలి .

వేరే ప్లేటులోనికి తీసుకోవాలి .

తిరిగి  స్టౌ  మీద బాండీ పెట్టుకుని  పోపుకు తెలిపిన నూనె మొత్తము  వేసి నూనె బాగా కాగగానే  ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి , కరివేపాకు , వేరుశనగ గుళ్ళు  మరియు జీడిపప్పు వేసి పోపు వేయించుకోవాలి .

ఆ పోపులో  చింతపండు  రసము , తగినంత  ఉప్పు మరియు పసుపు వేసి అయిదు నిముషాలు బాగా ఉడకనివ్వాలి .

తర్వాత ఉడికిన  అన్నం పోపులో  వేసి గరిటెతో బాగా కలుపు కోవాలి .

తర్వాత ముందుగా  సిద్ధం చేసుకున్న కరివేపాకు పొడి కూడా అందులో వేసుకుని స్టౌ సిమ్ లో పెట్టుకుని మూడు నిముషాలు  మగ్గనిచ్చి  దింపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే కరివేపాకు  పులిహోర  అల్పాహారానికి , దేవుని నివేదనకు  మరియు సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి