Thursday, March 1, 2018

ఊర మిరపకాయలు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఊర మిరపకాయలు  /  చల్ల మిరపకాయలు .

ఒక లీటరున్నర  పుల్లని  గట్టి పెరుగు   తగినన్ని  నీళ్ళు పోసి మజ్జిగ  చెసుకొవాలి .

ఒక  కె. జి. మరీ కారం లేని బోలు  పచ్చిమిరపకాయలు  తీసుకుని  కత్తి పీటతో  మధ్యకు  నిలువుగా  గాటు  పెట్టుకోవాలి .

తొడిమలు  తీయరాదు .

సన్నని  మిరపకాయలు  కూడా  వాడవచ్చును .

ఊరాక  సన్న పచ్చి మిరపకాయలు  కూడా  రుచిగా  ఉంటాయి.

ఇపుడు  ఒక  పెద్ద  స్టీల్  టిఫిన్ లో  మజ్జిగను  పోసుకుని  అందులో  స్పూను  పసుపు మరియు  తగినంత  ఉప్పు వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి .

అందులో  గాటు  పెట్టిన  పచ్చిమిరపకాయలు  వేసుకుని  బాగా  కలిపి  మూత పెట్టుకుని మూడు రోజులు  కదపకుండా  ఉంచాలి .

నాల్గవ రోజు  ఉదయం  చేతితో  మిరపకాయలు  తీసి  మజ్జిగ  టిఫిన్ లోనే  కారనిచ్చి  మిరపకాయలను  ఒక వెడల్పాటి  పళ్ళెంలో  పోసుకుని  ఆరు  బయట ఎర్రని  ఎండలో  ఎండబెట్టుకోవాలి .

సాయంత్రం   మళ్ళీ  మిరపకాయలు  మళ్ళీ  మజ్జిగలో  పోయాలి .

అలా  మజ్జిగ  పూర్తి అయ్యే వరకు షుమారు  నాలుగు రోజులు  ప్రతి  రోజూ  ఉదయం  ఎండబెట్టి  సాయంత్రం  మరల  పోస్తుండాలి .

మజ్జిగ  పూర్తయ్యాక  ఊర మిరపకాయలు  బాగా  తడి లేకుండా  గల గల లాడే వరకు  మరో  నాలుగైదు  రోజులు  ఎండబెట్టుకోవాలి .

తర్వాత టిఫిన్ లో  భద్ర పరచుకోవాలి .

కొంతమంది  పచ్చిమిరపకాయలు   ఊర  వేయకముందే  మజ్జిగ లో  నాలుగు కాయలు  నిమ్మరసం  పిండుకుంటారు .

దీని వలన  ఊరిన కాయలు రంగు మారకుండా  తెల్లగా ఉంటాయని , రుచి కూడా మరింత పెరుగుతుందని  అంటారు.

మీరు కూడా అలా చేసుకోవచ్చును.

మనకు  అవసరమైనప్పుడు   అవసరమైనవి  తీసుకుని  పప్పు , పప్పు కూరలు , కలగలపు పప్పు ఇలా  వండుకున్నప్పుడు    పక్కన ఆదరువుగా నూనెలో  వేయించుకోవచ్చును .

ఈ ఊర  మిరపకాయలు  ఏడాది అంతా  నిల్వ ఉంటాయి .

వానాకాలంలో  , వాతావరణం  చాలా  మబ్బులుగా  చలిగా  ఉన్నప్పుడు ,  బాగా  ఎండ వచ్చిన సమయంలో  రెండు నెలలకు  ఒకసారి  ఎండలో  పోసుకుని సాయంత్రం  టిఫిన్ లో  పోసుకుంటే  మెత్తపడకుండా  ఏడాది  అంతా  నిల్వ ఉంటాయి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి