Thursday, March 1, 2018

ఉప్పుడు పిండి

బియ్యపు రవ్వతో  పిండి లేదా ఉప్మా.

కావలసినవి .

బియ్యపు రవ్వ  --  ఒక గ్లాసు.
చాయ పెసర పప్పు --  పావు  గ్లాసు
పచ్చి కొబ్బరి   --  అర చిప్ప
నూనె  --  నాలుగు  స్పూన్లు
పచ్చి మిరపకాయలు  --  5  నిలువుగా  చీలికలు  చేసుకోవాలి .
కరివేపాకు  --  మూడు రెమ్మలు

పోపుకు .

ఎండుమిరపకాయలు --   3  ముక్కలుగా  చేసుకోవాలి .
పచ్చిశనగపప్పు  --  రెండు స్పూన్లు
చాయమినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  స్పూను
ఆవాలు  --  స్పూను
నెయ్యి  --  మూడు స్పూన్లు
నీళ్ళు  --  మూడు  గ్లాసులు.
ఉప్పు -- తగినంత

తయారీ  విధానము .

చాయపెసరపప్పు  తగినన్ని  నీళ్ళు  పోసి  గంటన్నర  సేపు  నానబెట్టుకోవాలి .

తర్వాత  నీరు  వడగట్టుకొని వేరే  ప్లేటులో  తీసుకోవాలి .

పచ్చి కొబ్బరి   తురుము కోవాలి.

ఇప్పుడు  స్టౌ  మీద  మందపాటి  గిన్నె కాని  లేదా  బాండీ కాని  పెట్టుకుని  నాలుగు  స్పూన్లు  నూనె  వేసుకుని  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , పచ్చిమిర్చి  మరియు  కరివేపాకు  వేసి  పోపు పెట్టుకోవాలి.

పోపు  వేగగానే  మొత్తం  మూడు గ్లాసుల  నీళ్ళు , నానబెట్టిన  చాయపెసరపప్పు  వేసి  , తగినంత  ఉప్పును  వేసి  మూత పెట్టి  నీళ్ళు బాగా తెర్లనివ్వాలి .

ఆ  తర్వాత  పచ్చి కొబ్బరి  తురుము  అందులో  వేసి  గరిటెతో  బాగా కలిపి  రెండు నిముషాలు  తెర్ల నివ్వాలి .

ఆ తర్వాత  సన్నగా  బియ్యపు రవ్వ పోసుకుంటూ  ఉండకట్టకుండా  అట్లకాడతో  బాగా కలపాలి .

తర్వాత  మూడు స్పూన్లు  నెయ్యి వేసి  అట్లకాడతో  బాగా కలపాలి .

తర్వాత  స్టౌ  సిమ్ లో  పెట్టి  మరో  పది నిముషాలు సన్నని సెగన మగ్గనివ్వాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బియ్యపు  రవ్వతో  పిండి  సర్వింగ్  కు సిద్ధం.

ఇందులో  నంచుకోవటానికి చట్నీ.

చిన్న నిమ్మకాయంత చింతపండు ( అయిదు నిముషాలు  తడిపి ), ఒక చిన్న కట్ట కొత్తిమీర , ఆరు  పచ్చి మిరపకాయలు , కొద్దిగా  బెల్లం మరియు  సరిపడా  ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  లో వేసుకుని  వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

తర్వాత స్టౌ మీద  పోపు  గరిటె  స్పెట్టి , రెండు స్పూన్లు  నెయ్యి వేసి  రెండు ఎండుమిరపకాయలు , స్పూను  మినపప్పు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ మరియు రెండు రెమ్మలు  కరివేపాకు  వేసుకుని  పోపు పెట్టుకుని పచ్చడిలో  కలుపు కోవాలి .

ఈ పచ్చడి  పిండి లోకి  కాంబినేషన్ గా బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి