Thursday, October 12, 2017

అలచందలు పచ్చి కొబ్బరి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

అలచందలు  పచ్చి కొబ్బరి  కూర.

లేత అలచందలు  --  అర కిలో
పచ్చి కొబ్బరి తురుము --  ఒకటిన్నర  కప్పు
పచ్చిమిరపకాయలు  --  పది
అల్లం  --  10 గ్రాముల ముక్క
పసుపు --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  ఒక కట్ట.

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  -- 4   చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి .
మినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా .

మొన్న  పుష్కరాలకు  శ్రీరంగపట్నం లో  Wood  Lands Hotel  లో  మధ్యాహ్నము భోజనము  చేసాము .

ఆ హోటల్లో  ఈ అలచందలు  కూర  చేసారు.

చాలా రుచిగా ఉంది .

అప్పటినుండి  ఈ కూర  చేయాలని  గుబులు  పుట్టింది .

తెనాలి  మార్కెట్ లో  నిన్న లేత అలచందలు  వచ్చాయి .

వెంటనే  కొని  ఈ రోజు  అలచందల  కూర  చేసాము .

చాలా  చాలా  రుచిగా  ఉంది .

అందువలన  తయారీ  విధానము   మీకు  కూడా  తెలియ చేస్తున్నాను .

తయారీ  విధానము .

ముందుగా  అలచందలు శుభ్రముగా  కడిగి  చాకుతో  చాలా  చిన్న చిన్న ముక్కలుగా  కట్  చేసుకోవాలి .

పచ్చిమిరపకాయలు  కూడా అదే  సైజులో  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .

అల్లం కూడా  పై చెక్కు తీసుకొని  చిన్న చిన్న  ముక్కలుగా  కట్ చేసుకోవాలి .

కొత్తిమీర  కూడా  శుభ్రం  చేసుకుని  కట్  చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు ,  ఇంగువ మరియు కరివేపాకు  వేసి  పోపు పెట్టు కోవాలి .

పోపు బాగా  వేగగానే  సన్నగా  తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు , సన్నగా  తరిగిన  అల్లం  ముక్కలు కూడా  పోపులో  వేసి  వాటిని  మూతపెట్టి   మూడు నిముషాలు మగ్గ నివ్వాలి .

తర్వాత  స్టౌ  మీడియం  సెగలో పెట్టి   వేగిన  పోపులో సన్నగా  తరిగిన  అలచంద ముక్కలు , తగినంత  ఉప్పు  మరియు  కొద్దిగా  పసుపు  వేసి మూతపెట్టి  పది నిముషాలు  అలచందల ముక్కలను  మెత్తగా  మగ్గ నివ్వాలి .

తర్వాత  పచ్చి కొబ్బరి  తురుమును  కూడా వేసి  మరో  మూడు నిముషాలు  ఉంచి , కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి దింపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

ఈ కూరలో  పచ్చిమిరపకాయలు  కారం మరియు అల్లం ముక్కల కారం వేసాము కనుక  కారం సరిపోతుంది .

ఎండుకారం  వేరుగా  వేయనవసరం లేదు .

అలచందలు  విడిగా  ఉడక పెట్ట నవసరం  లేదు .

చిన్న ముక్కలుగా  తరిగాము  కనుక  పోపులో  మగ్గి  పోతాయి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే అలచందలు కొబ్బరి కూర  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ కూర  భోజనము  లోకి, రోటిలు  మరియు  చపాతీల లోకి  కూడా  చాలా  రుచిగా  ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి